అంతర్వేదిలో రథం దగ్దం ఘటనపై సీబీఐ విచారణ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. దోషులు ఎవరైనా ఎంత గొప్పవాడైనా.. ఏ రాజకీయ పక్షానికి చెందిన వారైనా సరే ప్రభుత్వం గుర్తించి శిక్షిస్తుందని చెప్పారు. తన హయాంలో సీబీఐని రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వని చంద్రబాబు.. అంతర్వేది ఘటనపై మాత్రం అదే సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు.
రథం దగ్దం వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. ఫిబ్రవరిలోపు రథం పునర్మించాలని ఆదేశించడం సహా నిర్లక్ష్యం వహించినవారిపై చర్యలు తీసుకుందని చెప్పారు. మతాల మధ్య చిచ్చు పెట్టి, మతకల్లోలం సృష్టించాలని కొన్ని దుష్టశక్తులు యత్నిస్తున్నాయని ఆరోపించారు. భక్తుల ముసుగులో దుష్ట శక్తులు ప్రవేశించి మత విద్వేషాలు సృష్టించే కుట్రలు చేసి.. దాన్ని జగన్ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వానికి ఏ మతమైనా ఒక్కటేనని అన్నారు. తన పాలనలో విజయవాడలో దేవాలయాలు, 39 దేవతల విగ్రహాలు పగులగొట్టిన చంద్రబాబుకు హిందుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.