చిత్తూరు జిల్లాలో అమరరాజా ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేటాయించిన మొత్తం 483.27 ఎకరాల్లో వినియోగించుకోని 253.61 ఎకరాల్ని వెనక్కి తీసుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతిస్తూ పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలెవన్ జూన్ 30న జీవో 33ని జారీచేశారు. ఆ జీవోను రద్దు చేయాలని, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం నూనెగుండ్లపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబరు 65/1 , యాదమర్రి మండలం కొత్తపల్లి గ్రామ సర్వే నంబరు 1 / 1 బీ తదితర సర్వే నంబర్లలో తమకు కేటాయించిన 258 ఎకరాల్లో జోక్యం చేసుకోకుండా అధికారుల్ని ఆదేశించాలని కోరుతూ అమర రాజా సంస్థ ఆదరైజ్ సిగ్నెటరీ ఆంజనీ కిశోర్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పరిశ్రమలశాఖ ప్రత్యేక సీఎస్, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్, ఎండీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
రూ.2700 కోట్లతో అభివృద్ధి
హైకోర్టులో జరిగిన విచారణలో పిటిషనర్ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ .. ఏపీఐఐసీకి ప్రభుత్వం ఆ భూముల్ని విక్రయించిందన్నారు. ఏపీఐఐసీ తర్వాత పిటిషనర్ సంస్థకు భూముల్ని విక్రయించిందని గుర్తుచేశారు. ఈ వ్యవహారమై సొమ్ము చెల్లించి భూ విక్రయ దస్తావేజులు రాసుకున్నామన్నారు. అమరరాజా సంస్థకు ఇచ్చిన భూముల్ని రద్దు చేసి వెనక్కి తీసుకోమని ఏపీఐఐసీని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఈ భూముల్లో.. 2,700 కోట్ల రూపాయలకు పైగా భారీ పెట్టుబడి పెట్టి పలు అభివృద్ధి పనులు చేపట్టామని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒప్పంద నిబంధనల్లో పేర్కొన్న దానికంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. భూములు వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం పేర్కొన్న కారణాల్లో వాస్తవం లేదన్నారు. సంస్థలో తక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఏ సమాచారం ఆధారంగా ప్రభుత్వం చెబుతుందో అర్థంకాని విషయమన్నారు. దురుద్దేశంతో జీవో జారీ చేశారని వాదనలు వినిపించారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జీవో 33ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.