ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Amaravthi Assigned Lands: ఎస్సీలకు భూమి అమ్ముకునే హక్కులేదా? - ap cid news

ఉద్ధండరాయునిపాలేనికి చెందిన ఎస్సీ రైతు పూల రవి.. సీఐడీ (CID) విచారణకు హాజరయ్యారు. అసైన్డ్ భూములు అమ్మకాలకు సంబంధించి సుమారు 4 గంటల పాటు.. అధికారులు విచారణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పోలా రవి.. సీఐడీ అధికారులు భూముల అమ్మకాలతో పాటు.. సాక్షి సంతకాల విషయంపై ప్రశ్నలు అడిగారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్కే.. తనపై కక్షపూరితంగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు.

Amaravthi Assigned Lands
Amaravthi Assigned Lands

By

Published : Jul 7, 2021, 4:14 PM IST

Updated : Jul 8, 2021, 6:22 AM IST

రాజధాని అసైన్డ్ భూముల అమ్మకాలపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (mla alla ramakrishna reddy) ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ అధికారులు.. పోలా రవిని విచారణ చేశారు. విజయవాడ సీఐడీ కార్యాలయంలో 4 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం పోలా రవి మీడియాతో మాట్లాడుతూ.. తాను అమ్మిన పోలం విషయంపై సీఐడీ అధికారులు వివరాలు అడిగారని తెలిపారు. భూములు అమ్మకాల సమయంలో తాను ఐదుగురికి సాక్షి సంతకాలు పెట్టానని.. కానీ సీఐడీ అధికారులు.. 51 మందికి సంతకం పెట్టినట్లు చెబుతున్నారని వెల్లడించారు. కొంతమంది తనపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రాజధాని గ్రామాల్లోని వెనుకబడిన వర్గాల ప్రజల పై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కక్ష గట్టారని విమర్శించారు.

'నేను ఐదుగురికి సాక్షి సంతకాలు పెట్టాను. సీఐడీ‌ వాళ్లు 51 మందికి సాక్షి సంతకం పెట్టానంటున్నారు. నేను చదువుకోలేదు, వాళ్లు పెట్టమన్న చోట సంతకం పెట్టా. కొంతమంది నాపై అసత్య ప్రచారం‌ చేస్తున్నారు. ఎస్సీ వ్యక్తిగా నా భూమి అమ్ముకునే హక్కు నాకు లేదా..? ఎమ్మెల్యే ఆర్‌కే నాపై కక్షపూరితంగా వ్యవహరించారు'- పోలా రవి, అమరావతి రైతు

పోలా రవికి సీఐడీ నోటీసులు.. ఎందుకంటే

రాజధాని ప్రాంతంలోని తన అసైన్డ్‌ భూమిని ఎవరూ బలవంతంగా తీసుకోలేదని... తానే స్వచ్ఛందంగా అమ్ముకున్నానని వెల్లడించిన ఉద్ధండరాయునిపాలేనికి చెందిన ఎస్సీ రైతు పోలా రవికి సీఐడీ అధికారులు సోమవారం రోజు నోటీసులిచ్చారు. సీఆర్‌పీసీలోని 160 సెక్షన్‌ ప్రకారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ ఈ నోటీసు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి రావాలంటూ మధ్యాహ్నం 12 గంటలకు నోటీసు ఇచ్చారు. తాను ఓ వేడుకలో ఉన్నానని.. వెంటనే అంటే విచారణకు రాలేనని రవి చెప్పారు. దాంతో తాము పిలిచినప్పుడు హాజరుకావాలని సీఐడీ సిబ్బంది ఆయనకు సూచించారు.

సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ఏ.లక్ష్మీనారాయణ పేరిట ఈ నోటీసు ఇచ్చారు. ‘‘ఐపీసీలోని 166, 167, 217, 120 (బీ) రెడ్‌విత్‌ 34, 35, 36, 37 సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఎఫ్‌)(జీ), ఏపీ అసైన్డ్‌ భూములు బదలాయింపు నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం సీఐడీ క్రైమ్‌ నెంబర్‌ 05/2021ను గతంలో నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం సాగుతోంది. దీనికి సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులు మీకు తెలిసి ఉంటాయని భావిస్తున్నాం. అసైన్డ్‌ భూముల బదలాయింపునకు సంబంధించిన కొన్ని పత్రాలపై మీరు సాక్షిగా కూడా సంతకాలు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ ఎదుట హాజరుకాగలరని’’ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పోలా రవి సీఐడీ విచారణకు హాజరయ్యారు.

ఇదీ చదవండి:

Chandrababu: రైతులను ఆదుకోవటంలో జగన్ విఫలం: చంద్రబాబు

Last Updated : Jul 8, 2021, 6:22 AM IST

ABOUT THE AUTHOR

...view details