రాజధానిలోని అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ లిక్విడెషన్ ప్రక్రియకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇటీవల కేబినెట్ సమావేశంలో ఈ అంశానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంకుర ప్రాంతంలో తదుపరి పనులు జరగకుండా ముందస్తుగా చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అప్పటి సీఆర్డీఏ ప్రస్తుత ఏఎంఆర్డీఏ కమిషనర్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు సూచించింది.
స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం చేసుకున్న రాయితీ, అభివృద్ధి ఒప్పందం, భాగస్వామ్య ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు ప్రస్తుత అమరావతి మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, అప్పటి సీఆర్డీఏ కమిషనర్‌కు, ఏడీసీ సీఎండీకి అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.