అమరావతి ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ(amaravati srm university) ఇంజినీరింగ్ మొదటి బ్యాచ్‌కు చెందిన వారు రాజర్షి మజుందర్, సప్తర్షి మజుందర్. పశ్చిమబెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో జన్మించిన వీరిద్దరూ కవలలు. ఇద్దరికీ చిన్ననాటి నుంచే కంప్యూటర్, గేమింగ్ పట్ల అమితాసక్తి ఉండేది. గేమింగ్‌పై నైపుణ్యం సాధించి, కొత్త గేమ్‌లను అందుబాటులోకి తెచ్చి.. ఆ రంగంలో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలలు కన్నారు. వీరిద్దరికీ ఉన్న మరో సారూప్యత.. జపాన్ దేశం పట్ల మక్కువ. గేమింగ్, యానిమేషన్‌లో జపాన్ అగ్రగామిగా ఉండటంతో.. చిన్ననాటి నుంచి ఆ దేశంపై ఇష్టం పెంచుకున్నారు. అక్కడి ప్రజలు, భాష(language), సంస్కృతి పట్ల ఆకర్షితులయ్యారు. అక్కడి సౌకర్యాలు, ఉద్యోగావకాశాలు, జీవన విధానంపై పదేళ్లుగా పరిశీలన చేశారు.
చదువులోనూ ఎంతో ప్రతిభ కనబరిచే సోదరులు 12వ తరగతిలో 90 శాతం మార్కులతో అమరావతిలోని ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం సాధించారు. స్కాలర్‌షిప్‌తో బీటెక్ కంప్యూటర్ సైన్సు పూర్తి చేశారు. ప్రాంగణ ఎంపికల కోసం అనేక సంస్థలు, దేశాలతో ఒప్పందం చేసుకున్న ఎస్ఆర్ఎమ్ వర్సిటీ.. జపాన్‌తోనూ మంచి సంబంధాలు నెరపుతోంది. జపనీస్ భాష(japanese language) నేర్చుకునే సౌలభ్యాన్ని విద్యార్థులకు కల్పించింది. 6 నెలల పాటు సోదురులిద్దరూ జపాన్ భాషను నేర్చుకుని పట్టు సాధించారు.