ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

amaravati padayatra : పోటెత్తుతున్న అమరావతి ఉద్యమం.. పోలీసు హెచ్చరికలతో అలజడి!

అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ.. రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ప్రభంజనంలా కొనసాగుతోంది. అమరావతి రణన్నినాదం.. నలుదిక్కులా మార్మోగుతోంది. ఇవాళ (ఆదివారం) ఏడో రోజు మహాపాదయాత్ర పర్చూరు నుంచి ప్రారంభమైంది. అయితే.. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పాదయాత్ర నిర్వాహకులకు పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేయడంతో.. అలజడి వ్యక్తమైంది.

amaravati rythu maha padayatra 7th day starts
మార్మోగుతున్న అమరావతి రణన్నినాదం.. నేడు పాదయాత్ర సాగనుందిలా..

By

Published : Nov 7, 2021, 8:18 AM IST

Updated : Nov 7, 2021, 6:38 PM IST

పోటెత్తుతున్న అమరావతి ఉద్యమం.. పోలీసు హెచ్చరికలతో అలజడి!

అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ.. రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ప్రభంజనంలా కొనసాగుతోంది. అమరావతి రణన్నినాదం.. నలుదిక్కులా మార్మోగుతోంది. శనివారం 14 కి.మీ. మేర రైతుల సాగిన పాదయాత్ర.. ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. ఇవాళ ఏడో రోజు మహాపాదయాత్ర ఉదయం 8 గంటలకు పర్చూరు నుంచి ప్రారంభమైంది. సుమారు 17 కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర.. సాయంత్రం ఇంకొల్లులో ముగుస్తుంది.

మధ్యాహ్నం పర్చూరు మండలం వంకాయలపాడులో భోజనం చేస్తారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వంకాయలపాడు నుంచి మొదలై.. ఇంకొల్లుకు చేరుకుంటుంది. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. కాగా.. కార్తీక సోమవారం సందర్భంగా రేపు పాదయాత్రకు విరామం ఇవ్వాలని నిర్ణయించారు. మంగళవారం నుంచి రైతుల మహాపాదయాత్ర యథావిధిగా కొనసాగనుంది.

ఇదిలా ఉంటే.. అమరావతి రాజధాని కోసం రైతులు, మహిళలు చేస్తున్న పాదయాత్ర సాగుతున్న తీరుపై పోలీసులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ.. పాదయాత్ర నిర్వాహకులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు వెయ్యిమంది పోలీసులు మోహరించారు.

పర్చూరులోని రైతుల శిబిరం వద్దకు వెళ్లిన డీఎస్పీ శ్రీకాంత్.. పరిస్థిని సమీక్షించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, శబ్దాలు ఎక్కువగా చేస్తున్నారని అన్నారు. అయితే.. హైకోర్టు ఆదేశాల మేరకే పాదయాత్ర సాగుతోందని ఐకాస నాయకులు తెలిపారు. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించడం లేదని స్పష్టం చేశారు. అయితే.. ఎవరైనా వచ్చి తమకు సంఘీభావం తెలిపితే, తమకు సంబంధం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లాలో యాత్ర ఇలా..

అమరావతి రైతులు తలపెట్టిన "న్యాయస్థానం నుంచి దేవస్థాననం" మహాపాదయాత్ర.. ఆరో రోజైన శనివారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ జిల్లాలో 12 రోజులపాటు యాత్ర సాగుతుంది. మరో రెండు రోజులు విశ్రాంతి కోసం మార్గంమధ్యలో రైతులు ఆగనున్నారు. జిల్లాలో పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు, ఒంగోలు, టంగుటూరు, కందుకూరు, గుడ్లూరు తదితర మండలాల మీదుగా పాదయాత్ర సాగుతుంది. 19న నెల్లూరు జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. రాజధాని అమరావతికి మద్దతుగా చేస్తున్న యాత్రకు ఇప్పటికే పలు సంఘాలు, రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.

అమరావతి రైతుల పాదయాత్రకు పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ సంఘీభావం తెలిపారు. స్నేహితులతో కలిసి రూ.10.07 లక్షలు విరాళం అందించారు. పర్చూరు వద్ద రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు.

హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారు...

అమరావతి రైతులు హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారని ప్రకాశం ఎస్పీ మలికా గార్గ్ అన్నారు. అనుమతించిన వారికంటే 20 రెట్లు ఎక్కువమంది మహాపాదయాత్రకు హాజరవుతున్నారని చెప్పారు. రైతుల పాదయాత్రకు 4 వాహనాలకే అనుమతి ఉండగా...నిన్న యాత్రలో 500 వాహనాలు ఉన్నాయని వివరించారు. పాదయాత్రకు పోలీసులు విఘాతం కలిగిస్తున్నామనే వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.

డిసెంబర్​ 15న తిరుమలకు చేరేలా..
3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా తలపెట్టిన ఈ పాదయాత్ర 45 రోజులపాటు సాగనుంది. డిసెంబర్ 15న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా రాజధాని రైతులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

ఇదీ చదవండి : Amaravathi Farmers: ప్రభంజనంలా మహాపాదయాత్ర.. ప్రకాశం జిల్లాలోకి ప్రవేశం

Last Updated : Nov 7, 2021, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details