Amaravathi Construction: హైకోర్టు ధర్మాసనం తీర్పు అమలు చేసే క్రమంలో అమరావతి నిర్మాణ ప్రక్రియను.. సీఆర్డీఏ అధికారులు పునఃప్రారంభించారు. రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, అఖిలభారత సర్వీసు అధికారుల గృహ సముదాయాల పనులు చేపట్టారు. ఈ పనులను గతంలో నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ సంస్థ చేపట్టింది. ఇప్పటికే 65శాతం మేర పనులు పూర్తయ్యాయి. మొత్తం 18 టవర్లు ఇక్కడ నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.645కోట్లు. ప్రస్తుతం రూ.42కోట్లు నిర్మాణ సంస్థకు మంజూరు చేశారు. ఆ నిధులతోనే పనులు చేస్తున్నారు. భవనాల నిర్మాణాన్ని గతంలోనే పూర్తిచేయగా.. ఇప్పుడు అంతర్గత పనులు చేయాల్సి ఉంది. సీఆర్డీఏ అధికారులు నిర్మాణ సంస్థతో ఈనెల 23న సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది చివరిలోగా పనులు పూర్తి చేయాలని గడువు విధించారు. 24వ తేది నుంచి డిజైనింగ్ పనులు మొదలుపెట్టారు.
రెండు వందల మందికిపైగా కార్మికులు పనులు చేస్తున్నారు. ఈ వారంలో మరో 200 మంది వరకు వీరికి జత కానున్నారు. గోడల డిజైనింగ్, రంగులు, విద్యుత్, లిఫ్ట్, టైల్స్ పనులు పూర్తికావాల్సి ఉంది. ఈ పనులన్నీ నిర్వహించేందుకు మే నెలలో 12వందల మంది కార్మికులు వస్తారని చెబుతున్నారు. దాదాపు మూడేళ్లుగా పనులు నిలిచిపోవటంతో భవనాల వద్ద పనులకు అనువైన వాతావరణం లేదు. పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. విద్యుత్ సరఫరా ఆపేశారు. ఇప్పుడు పనులు జరగాలంటే కరెంటు తప్పనిసరి. నిర్మాణాలు జరిపే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యల్ని త్వరగా పరిష్కరించి అన్నిచోట్లా పెండింగ్ పనులు పూర్తి చేయాలని రాజధాని రైతులు కోరుతున్నారు.