అమరావతిలో 250వ రోజూ రాజధాని రైతుల ఉద్యమం కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా రాజధాని గ్రామాల్లో రైతులు దీక్షలు చేపట్టారు. రణభేరి పేరిట తుళ్లూరులో రైతులు డప్పులు, పళ్లాలు మోగిస్తూ నిరసన తెలియజేశారు. వివిధ రకాల చేతి వృత్తుల వారు తమ నిరసనను వివిధ రూపాల్లో తెలియజేశారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే... ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
మడమ తిప్పారు....
మందడంలోనూ ప్లేట్లు మోగిస్తూ రైతులు, మహిళలు నిరసన చేపట్టారు. రైతుల దీక్షలకు కృష్ణా జిల్లా మాజీ ఛైర్‌పర్సన్ గద్దె అనురాధ సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ మాట మార్చి మడమ తిప్పారంటూ విమర్శించారు. జగన్ మొండి వైఖరిని విడనాడాలని హితవు పలికారు.
29 గ్రామాల సమస్య కాదు...
5 కోట్ల ఆంధ్రులు.... తమ నిరసనలకు మద్దతు తెలపాలంటూ వెలగపూడిలో మహిళలు కొంగుపట్టి భిక్షాటన చేశారు. ఇది కేవలం 29 గ్రామాల సమస్య కాదని.. ఆంధ్రుల సమస్యని నినదించారు. భిక్షాటన చేసిన డబ్బులతో కోర్టులకెళ్లి రాజధానిని దక్కించుకుంటామని తేల్చిచెప్పారు.
రాజధానిలో రణభేరి నినాదం గ్రామ గ్రామాన కొనసాగుతోంది. ఉద్దండరాయునిపాలెంలోనూ రైతులు నిరసన తెలిపారు. మండలంలోని అనేక ప్రాంతాల్లో కాడెద్దులతో నిరసన తెలియజేశారు. రాయపూడిలో రైతులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి...అంబేడ్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 3 రాజధానుల వల్ల అమరావతి ప్రాంత ప్రజలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించేవరకు పోరాటం కొనసాగుతుందని రైతులు, మహిళలు ముక్త కంఠంతో చెబుతున్నారు.
ఇదీ చదవండి
అందాల జలపాతం...చూసొద్దామా..!