ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆగ్రహావతి : రైతన్నల ఉద్యమం ఉగ్రరూపం - అమరావతి మహిళా రైతుల అరెస్టులు

రాజధాని కోసం అమరావతి రైతుల పోరు ఉద్ధృతమవుతుంది. రైతుల శాంతియుత ధర్నాలు.. పోలీసుల చర్యలతో ఉద్రిక్తంగా మారిపోయాయి. మహిళల అరెస్టులతో అమరావతి అట్టుడికిపోయింది. మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా నేడు రాజధాని బంద్‌కు పిలుపునిచ్చారు.  పోలీసులు, ప్రభుత్వ చర్యలను అన్ని వర్గాల ప్రజలు తప్పుబడుతున్నారు.

amaravati-protest-turns-into-tensed
ఆగ్రహావతి : రైతన్నల ఉద్యమం ఉగ్రరూపం

By

Published : Jan 4, 2020, 5:48 AM IST

Updated : Jan 4, 2020, 6:31 AM IST

ఆగ్రహావతి.. ఉద్యమం ఉగ్రరూపం

రాజధాని సాధన కోసం అమరావతి రైతులు చేస్తోన్న నిరసన దీక్షలు.. శుక్రవారం ఉద్రిక్తంగా మారాయి. సకల జనుల సమ్మెలో భాగంగా నిరసనలు తెలియజేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది. మహిళలను వాహనాల్లో ఎక్కించే క్రమంలో పోలీసులు దూకుడుగా వ్యవహరించారు. ప్రతిఘటించినవారిపై పోలీసులు తమదైన శైలిలో స్పందించారు. ఈ క్రమంలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. పోలీసులను మిగతా ఆందోళనకారులు అడ్డుకోవటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు దూషణలకు పాల్పడుతూ దాడి చేశారని మహిళలు తీవ్ర ఆవేదన చెందారు. ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పుతోందని కంటతడి పెట్టుకున్నారు.

పరస్పర ఫిర్యాదులు

అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై పోలీసులు, రైతులు పరస్పరం కేసులు పెట్టుకునే స్థాయికి దారితీశాయి. ఘటనలపై ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం రాత్రి భారీ సంఖ్యలో మహిళలు తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. శాంతియుతంగా సమ్మెలు చేస్తుంటే... పోలీసులే రెచ్చగొట్టారంటూ గాయపడిన మహిళా రైతులు ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కల్గించారని పోలీసులు మహిళారైతులపైనే కేసులు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు తమపై దాడులకు పాల్పడ్డారని మహిళలు ఆరోపించారు.

ఎన్​హెచ్​ఆర్సీలో ఫిర్యాదు

ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు ఇష్టారీతిన ప్రవర్తించారంటూ తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్... కేంద్ర మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు అమానుషంగా వ్యవహరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై స్వతంత్ర దర్యాప్తుచేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్​హెచ్​ఆర్సీని కోరారు. ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర మానవహక్కుల సంఘం... పోలీసులకు నోటీసులు ఇచ్చి వివరణ కోరుతామని స్పష్టతనిచ్చింది.

ఆడబిడ్డలపై దౌర్జన్యమా..?

రైతులు, మహిళలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఆడబిడ్డలని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించారని మండిపడ్డారు. అమరావతి ప్రాంత రైతులు, మహిళలపై పోలీసుల దౌర్జన్యాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగా ఆందోళన చేసేవాళ్లపై దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని మండిపడ్డారు. మందడం, వెలగపూడిలో రైతుల నిరసనలకు ప్రకాశం జిల్లా కనిగిరి తెదేపా నేతలు సంఘీభావం తెలిపారు. మందడంలో మహిళా రైతులను అఖిలపక్షం నేతలు పరామర్శించారు. పోలీసుల దాష్టీకానికి తలొగ్గేది లేదని న్యాయవాదులు, ఇతర ప్రజా, ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.

18వ రోజూ కొనసాగనున్న ఆందోళనలు

రాజధాని ఆందోళనలు సమీప గ్రామాలకూ విస్తరించాయి. రాజధాని రైతులకు సంఘీభావంగా తుళ్లూరు మండలం పెదపరిమిలో ప్రజలు ఆందోళనలు చేశారు. అమరావతిలోనే ప్రజారాజధానిని కొనసాగించాలంటూ పెదపరిమి కూడలిలో హోమం నిర్వహించారు. 18వ రోజైన నేడు మందడం, తుళ్లూరుల్లో మహాధర్నాలు నిర్వహించనున్నారు. వెలగపూడిలో రిలేనిరాహార దీక్షలు కొనసాగుతాయి. ప్రకాశం, గోదావరి జిల్లాల్లోనూ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేపట్టనున్నాయి. మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా నేడు రాజధాని బంద్‌కు పిలుపునిచ్చారు.

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు భారీ మానవహారం చేపట్టనున్నారు. తుళ్లూరు నుంచి వెంకటపాలెం వరకు మానవహారం చేపట్టాలని నిర్ణయించారు. ఉదయం గం. 10.40 నుంచి మధ్యాహ్నం గం.12.40 వరకు 2 గంటలపాటు కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి :

'రాజధాని పోరు మరింత ఉద్ధృతం'

Last Updated : Jan 4, 2020, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details