Amaravati Maha Padayatra: గుంటూరు జిల్లా వెంకటపాలెంలో మొదలు కానున్న అమరావతి మహాపాదయాత్ర. సరిగ్గా రెండు నెలల తర్వాత నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ముగియనుంది. అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమరావతిపై జరుగుతున్న కుట్రను ప్రజలకు వివరించడంతోపాటుగా.. పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తామని రైతులు చెబుతున్నారు. 12 పార్లమెంట్, 45అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగే యాత్రలో.. మోపిదేవి, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం పుణ్యక్షేత్రాలను దర్శించుకోనున్నారు. అలాగే ఈసారి జాతీయ రహదారుల వెంట కాకుండా పల్లెలు, పట్టణాల ద్వారా నడిచేలా రైతులు రూట్‌మ్యాప్ రూపొందించారు. యాత్రకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, వివిధ కమిటీలు సమన్వయం చేసేలా ప్రణాళిక తయారు చేశారు.
రైతులకు సంఘీభావం తెలపనున్న నారా లోకేశ్
సోమవారం వెంకటపాలెంలో మొదలయ్యే యాత్ర.. కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి చేరుకోనుంది. కృష్ణాయపాలెం వద్ద యాత్రలో పాల్గొనున్న తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రైతులకు సంఘీభావం తెలపనున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు రాజధాని అమరావతి 29 గ్రామాలకే పరిమితం కాదని, యావత్తు రాష్ట్ర ప్రజల సొత్తు అని ఐకాస నాయకులు, రైతులు స్పష్టంచేస్తున్నారు. అమరావతిపై వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి వినియోగించాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. దీనిపై విషప్రచారం చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.