amaravati farmers padayatra: అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర తిరుమల శ్రీనివాసుడి చెంతకు సమీపిస్తోంది. ఇప్పటికే దిగ్విజయంగా మూడు జిల్లాలను దాటుకుని వచ్చిన రైతులు.. నేడు ఆ కలియుగ వైకుంఠనాథుడు కొలువై ఉండే చిత్తూరు జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు. 37వ రోజు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రారంభం కానున్న యాత్ర.. వెల్లివెడు మీదుగా శ్రీకాళహస్తి మండలంలోని జగ్గరాజుపల్లెలోకి ప్రవేశించనుంది. సోమవారం వెంకటగిరిలో జరిగిన పాదయాత్ర కర్షక జాతరను తలపించింది. విద్యార్థులు, వృత్తి నిపుణులు, రాజకీయ, ప్రజాసంఘాల నేతలు రైతులతో పాదం కలిపారు. వెంకటగిరి యాదవ సంఘం వీరతాళ్లు, తప్పెట్లు, టపాసులతో అన్నదాతలకు స్వాగతం చెప్పింది.
ప్రభుత్వం కళ్లు తెరవాలి..
రాజధాని రైతులకు సంఫీుభావం తెలిపేందుకు వచ్చిన స్థానికులతో వెంకటగిరి పట్టణం జనసంద్రంగా మారింది. అడుగడుగునా మహిళలపై పూలవర్షం కురిపించారు. అమరావతి రాజధాని కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి..రాజధానిని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. దిల్లీ నుంచి వచ్చిన భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు అమరావతి రైతులు విజయం సాధించాలని అభిలాషించారు.