అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్‌తో ఉద్యమం చేస్తున్న రైతులు... ఇవాళ్టి భారత్ బంద్‌లోనూ పాల్గొన్నారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు అమరావతి రైతు ఐకాస సంఘీభావం ప్రకటించింది. ఈ క్రమంలో అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మందడంలో ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. వెలగపూడిలో మానవహారంగా ఏర్పడ్డారు. జై అమరావతితో పాటు జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు నష్టం చేసేలా ఎవరు వ్యవహరించినా అంగీకరించబోమని స్పష్టం చేశారు.
కేంద్రం పట్టించుకోవడం లేదు
ప్రజలకు మేలు చేసేలా పరిపాలన ఉండాలే తప్ప... వారిని ఇబ్బంది పెట్టేలా ఉండరాదని రైతులు అభిప్రాయపడ్డారు. లక్షలాది మంది రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారంటే... వ్యవసాయ చట్టాలు తప్పకుండా వారికి నష్టం చేకూర్చేవేనని వ్యాఖ్యానించారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారని... ఇప్పుడు జగన్ రాజధానిని ఇక్కడినుంచి తరలిస్తుంటే ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం కనీసం చర్చలు జరుపుతోందని... అమరావతిలో మాత్రం 357 రోజులుగా ఉద్యమిస్తున్నా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.