ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంగళగిరి టూ దుగ్గిరాల.. అమరావతి రైతుల మహాపాదయాత్ర @ రెండో రోజు - అమరావతి రైతుల మహాపాదయాత్ర రెండోరోజు

Mahapadayatra Day 2 : అడుగడుగునా అఖండ స్వాగతాలతో.. అమరావతి రైతుల మహాపాదయాత్ర రెండోరోజునా.. ఆకుపచ్చ దండులా ముందుకుసాగింది. సూర్యభగవానుడి రథం ముందుకు కదలగా.. అంబేడ్కర్ ఫోటోలు చేతపట్టుకుని.. ఏకైక రాజధాని అమరావతేనంటూ.. గుండెలు పొంగేలా నినాదాలు చేస్తూ.. అన్నదాతలు కదం తొక్కారు. మేళతాళాలు, డప్పువాయిద్యాలతో కళాకారులు అలరించగా.. ఉత్సాహంగా పాదయాత్ర సాగింది.

Mahapadayatra Day 2
Mahapadayatra Day 2

By

Published : Sep 13, 2022, 7:43 PM IST

Updated : Sep 14, 2022, 6:35 AM IST

మంగళగిరి టూ దుగ్గిరాల.. అమరావతి రైతుల మహాపాదయాత్ర @ రెండో రోజు

Farmers Padayatra Day 2: మహా పాదయాత్రలో ఆకుపచ్చని దండులా సాగుతున్న అమరావతి రైతులకు... శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి రథానికి అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రాలు చేత పట్టుకుని... ఏకైక రాజధాని అమరావతి అంటూ నినాదాలు చేస్తూ యాత్రలో రైతులు, కూలీలు కదం తొక్కారు. రెండోరోజైన మంగళవారం ఉదయం 9.15 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైష్ణవి కల్యాణ మండపం నుంచి మహా పాదయాత్ర ప్రారంభమై దుగ్గిరాల దాకా సాగింది. దారిమధ్యలో పలు గ్రామాల వారు పాదయాత్రకు ఆహ్వానం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు కట్టారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల మోతతో, టపాసులు పేలుస్తూ, పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంగళగిరిలో పెదబజార్‌ నుంచి గాలిగోపురం దాకా రహదారికి ఇరువైపులా ఉన్న వర్తక వ్యాపారులు యాత్రకు సంఘీభావం తెలిపారు. వారి దుకాణాల ముంగిటకు రాగానే రైతులకు రెండు వేళ్లతో విజయ చిహ్నాల్ని చూపుతూ అభివాదం చేశారు. సుమారు గంటకుపైగా ఆ రహదారిలో యాత్ర సాగింది. కొందరు వ్యాపారులు తమ ఇళ్ల పైఅంతస్తుల నుంచి పూలు చల్లి ఆత్మీయతను ప్రదర్శించారు. యాత్ర గాలిగోపురం దగ్గరకు చేరుకునేసరికి ఉదయం 10.40 అయింది. లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గర రైతులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి మోకరిల్లి జై అమరావతి నినాదాలు చేశారు.

.

పెదవడ్లపూడి రహదారి జనసంద్రం...

తెనాలి ఫ్లైఓవర్‌ మీదుగా యాత్ర పెదవడ్లపూడి ప్రధాన రహదారిలోకి ప్రవేశించింది. పెదవడ్లపూడికి చేరుకోగానే ఆ గ్రామానికి చెందిన రాష్ట్ర భాజపా నాయకుడు పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చి యాత్రను స్వాగతించారు. ఇది మేజర్‌ పంచాయతీ కావడంతో వేల సంఖ్యలో ప్రజలు తరలిరావటంతో పెదవడ్లపూడి రహదారి జనసంద్రమైంది. ఈ గ్రామం దాటాక రేవేంద్రపాడు సమీపంలో భోజనం కోసం రైతులు ఆగారు. ఇక్కడికి పోలీసులు వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్న 600 మంది రైతులకు కార్డులు పంపిణీ చేశారు. తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే వై.వీరాంజనేయులు, భాజపా తరఫున ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, పాతూరి నాగభూషణం, వల్లూరి జయప్రకాష్‌, లంకా దినకర్‌, పాటి బండ్ల రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్‌కుమార్‌, సీపీఎం, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు. వైకాపా మినహా మిగిలిన అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు తరలివచ్చి యాత్రకు సంఘీభావం తెలిపారు.

.

ఆప్యాయత... ఆదరణ

మధ్యాహ్నం భోజన విరామం తర్వాత రైతులు రేవేంద్రపాడు, తుమ్మపూడి, మోరంపూడి, చింతలపూడి, మంచికలపూడిల మీదుగా దుగ్గిరాల చేరుకున్నారు. 18 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్ర దుగ్గిరాల చేరుకునే సరికి రాత్రి 7 గంటలు అయింది. దుగ్గిరాల పురవీధుల్లో రథం దగ్గరకు తండోపతండాలుగా వచ్చిన జనం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.పాదయాత్రలో సాగుతున్న మహిళా రైతులను పలు గ్రామాల ప్రజలు తమ ఇళ్లలోకి ఆహ్వానించారు. కొంతసేపు సేదతీరి వెళ్లాలంటూ ఆప్యాయంగా పలుకరించారు. తుమ్మపూడి దగ్గర గొడవర్రుకు చెందిన మత్స్యకారులు కృష్ణాడెల్టా వెస్ట్రన్‌ కాల్వలో ప్రత్యేకంగా పడవలు వేసుకుని వచ్చి మరీ యాత్రను స్వాగతించారు. యాత్రలో పరిరక్షణ సమితి నాయకులు గద్దె తిరుపతిరావు, శివారెడ్డి, సుధాకర్‌, తెదేపా నాయకులు రాయపాటి శ్రీనివాస్‌, నాదెండ్ల బ్రహ్మం చౌదరి, పోతినేని శ్రీనివాస్‌, జవ్వాది కిరణ్‌చంద్‌, రావిపాటి సాయికృష్ణ, పెద్దసంఖ్యలో సీపీఐ, సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు.

.

సీఎంది నియంతృత్వ ధోరణి...

* రాజధానిని మార్చటం ద్వారా సీఎం తన నియంతృత్వ ధోరణిని చాటుకున్నారని భాజపా సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మూడు రాజధానుల ప్రకటనతో జగన్‌ చరిత్రహీనుడిగా నిలిచిపోతారని దుయ్యబట్టారు. కేంద్ర కార్మిక బోర్డు మాజీ ఛైర్మన్‌ వల్లూరి జయప్రకాష్‌ మాట్లాడుతూ... అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం అమలు చేయకుండా జగన్‌రెడ్డి తన ప్రత్యేక రాజ్యాంగం అమలు చేస్తూ ఫ్యాక్షన్‌ స్వభావాన్ని చాటుకున్నారని విమర్శించారు.

.

* తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ... రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం రెవెన్యూ మంత్రి ధర్మానకు తగదని హితవు పలికారు. ఉత్తరాంధ్రను నాశనం చేస్తున్న విజయసాయిరెడ్డి లాంటి వారిని ధర్మాన ఎదుర్కోవాలని సూచించారు.

.

* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ... రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలా లేక ఒకటే రాజధాని ఉండాలా అనే దానిపై జగన్‌ ప్రజాభిప్రాయం కోరాలని డిమాండ్‌ చేశారు. మూడు రాజధానుల మీద సీఎంకు అంత నమ్మకం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ చేశారు.

.

* పీసీసీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్‌ మాట్లాడుతూ... మూడు రాజధానుల పేరిట 30 వేల మంది రైతులను బలి చేయవద్దని కోరారు.

* ఆయా గ్రామాలకు చెందిన జనసైనికులు భారీగా తరలివచ్చారు. ఎక్కడికక్కడ పాదయాత్రకు మద్దతుగా నిలుస్తూ రైతులకు అడుగడుగునా మజ్జిగ, మంచినీరు అందించారు.


ఇవీ చదవండి:

Last Updated : Sep 14, 2022, 6:35 AM IST

ABOUT THE AUTHOR

...view details