రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 409వ రోజుకు చేరాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, నెక్కళ్లు, వెంకటపాలెంలో.. దీక్షా శిబిరాల వద్ద నిరసనలు కొనసాగాయి.
నమ్మి భూములిచ్చినందుకు ప్రభుత్వం తమను రోడ్డుపై నిలబెట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతికి మద్దతుగా దీక్షా శిబిరాల వద్ద నినాదాలు చేశారు.