అమరావతి నిర్మాణ పనుల కోసమని రాజధాని భూములను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం పట్ల రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజధాని గ్రామాలకు చెందిన రైతులు శనివారం రాత్రి నిరసన గళం విప్పారు. రాజధాని నిర్మాణాలను చేపట్టకుండా భూములు విక్రయించేందుకు చీకటి జీవోను జారీచేసిందని మండిపడ్డారు. అమరావతిని నిర్వీర్యం చేయడానికే గత ప్రభుత్వంలో బీఆర్ షెట్టి మెడిసిటీకి కేటాయించిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజీకి కేటాయించిన 148 ఎకరాలను విక్రయించేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. రాజధాని రైతులకు కౌలు, పేదలకు పింఛన్లు చెల్లించడం లేదు. అసైన్డ్ రైతులు, నాన్ పూలింగ్ భూముల్లో ప్లాట్లు వచ్చిన రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం రాజధాని భూములను అమ్మడానికి సిద్ధపడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. న్యాయస్థానాలు తీర్పు ఇచ్చినా ఒక్క గమేలా సిమెంటు వేసి రాజధానిలో పనిచేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
'అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలి. అమరావతి నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి. రాజధాని అభివృద్ధి కోసం మాత్రమే ఏ సంస్థలకూ కేటాయించని భూములను నిధుల సమీకరణకు వినియోగించేందుకు ఒప్పుకొంటాం' అని రాజధాని రైతులు తెగేసి చెప్పారు. లేనిపక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రభుత్వ చర్యలను ఎదుర్కొంటామని హెచ్చరించారు. నిరసన వ్యక్తంచేసిన వారిలో రైతులు కాటా అప్పారావు, మల్లేశ్వరి, కామినేని గోవిందమ్మ, రాధిక తదితరులు ఉన్నారు.