Amaravati Farmers Padayatra: అమరావతిపై అధికార పెద్దల దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, రాజధాని ఆవశ్యకతను చాటేందుకు... రైతులు రెండో విడత మహాపాదయాత్ర చేపట్టారు. రాజధాని అభివృద్ధి చెందితే రాష్ట్ర ప్రజలందరికీ ఫలాలు అందుతాయనే విషయాన్ని... ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అమరావతి అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధిస్తుందని వివరించనున్నారు. దాదాపు ఏడాది కిందట అమరావతి నుంచి తిరుపతి వరకు చేసిన మొదటివిడత పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకే... అమరావతిలో రాజధాని నిర్మించాలంటూ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. కానీ మొండి వైఖరి వీడని వైకాపా ప్రభుత్వం... ఇప్పటికీ మూడు రాజధానుల పాటే పాడుతోంది. హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయకుండా, అఫిడవిట్‌లతో కాలయాపన చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ‘బిల్డ్ అమరావతి- సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో అమరావతి నుంచి అరసవల్లి వరకు మరో మహాపాదయాత్ర చేస్తున్నారు. నేడు అమరావతిలో మొదలై వెయ్యి కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర... నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యభగవానుడి చెంతకు చేరనుంది. మొత్తం 12 పార్లమెంట్, 45అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా వెళ్లే యాత్రలో... మోపిదేవి, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం పుణ్యక్షేత్రాలను రైతులు దర్శించుకోనున్నారు. ఈసారి జాతీయ రహదారుల వెంట కాకుండా... పల్లెలు, పట్టణాల మీదుగా నడిచేలా రూట్‌మ్యాప్ రూపొందించారు. 60 రోజుల పాటు జరిగే పాదయాత్రలో 9 సెలవు దినాలు ఉంటాయి.
పాదయాత్ర దిగ్విజయంగా సాగాలంటూ... వేకువజామున 5 గంటలకు వెంకటపాలెంలోని తి.తి.దే ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అమరావతి ఐకాస నేతలు, రైతులు పూజలు చేశారు. ఆ తర్వాత 6 గంటల 3 నిమిషాలకు ఆలయం వెలుపల ఉన్న శ్రీవారి రథాన్ని ముందుకు లాగి... పాదయాత్రకు అంకురార్పణ చేశారు. అనంతరం వెంకటపాలెం గ్రామంలోకి రథాన్ని తీసుకెళ్లారు. 9 గంటలకు జెండా ఊపి యాత్రను లాంఛనంగా ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కృష్ణాయపాలెం, యర్రబాలెం మీదుగా సాయంత్రానికి మంగళగిరికి యాత్ర చేరుకుంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. మొదటిరోజు దాదాపు 15 కిలోమీటర్ల మేర నడవనున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు, అన్ని వర్గాలవారు విడతలవారీగా ఈ యాత్రలో మమేకం కానున్నారు.
పాదయాత్రలో పాల్గొని ఉద్యమానికి మద్దతివ్వాలని అమరావతి పరిరక్షణ సమితి, రైతు ఐకాస నేతలు... వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలసి ఆహ్వానించారు. అన్ని పార్టీల నేతలు పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు. తెలుగుదేశం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రానున్నారు. భాజపా తరఫున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, పార్టీ నాయకులు సత్యకుమార్, వల్లూరి జయప్రకాశ్, కాంగ్రెస్ తరఫున కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, శైలజానాథ్, తులసిరెడ్డి హాజరవుతారు. జనసేన నుంచి పోతిన మహేష్, శ్రీనివాస్ యాదవ్, సీపీఎం నుంచి శ్రీనివాసరావు, చిగురుపాటి బాబూరావు, సీపీఐ నుంచి నారాయణ, రామకృష్ణ పాలుపంచుకోనున్నారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలోకి పాదయాత్ర చేరుకునే సమయంలో రైతులకు స్వాగతం పలకనున్న లోకేశ్... వారితో కలిసి నడవనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్... ఏదో ఒక జిల్లాలో పాదయాత్రలో పాల్గొంటారని సమాచారం.