amaravati padayatra : అమరావతి గుంటూరు జిల్లాలో ఉంది కాబట్టి అక్కడ పాదయాత్రకు మద్దతు సహజం. ప్రకాశం జిల్లా పక్కనే ఉంది కాబట్టి అక్కడా సంఘీభావం వెల్లువెత్తింది. కానీ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో స్పందనను ఊహించగలమా? ఈ సందేహాలన్నీ పాదయాత్రలో పటాపంచెలయ్యాయి. రైతులకు మద్దతుగా. సింహపురి సై అంటే.. తిరునగరి రారమ్మని ఆహ్వానించింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 18రోజులు, చిత్తూరు జిల్లాలో 8 రోజులు దిగ్విజయంగా సాగింది.
భావోద్వేగాల కలబోతగా పాదయాత్ర..
అమరావతి నుంచి అలిపిరి వరకూ అనేక భావోద్వేగాల కలబోతగా పాదయాత్ర సాగింది. దారి పొడవునా పొలాల్లో ఉన్న కూలీలు, రైతులు సాటి రైతులకు మద్దతు తెలిపారు. పనులు కాసేపు పక్కనపెట్టి పాదయాత్రవెళ్లే రోడ్డుమీదకు.. వచ్చి కలిశారు. అమరావతి రైతులతో గొంతు కలిపారు. అమరావతి రైతులు ఒంటరివారు కారని, తామంతా వెంట నడుస్తామని ఏడుకొండలవాడి చెంతకు చేరేలోపే కొండంత భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లావెంగమాంబపురంలో యాత్రకు మద్దతుగా స్థానికులు అమరావతి అంటూ పొలంలో వరినాట్లు వేశారు. అమరావతి రైతులూ నాట్లు వేసి.. స్థానిక రైతులకు కృతజ్ఞతలు చెప్పారు.
వెంకటేశ్వరస్వామి రథం ముందు ముస్లింలు నమాజ్ ..
సీమజిల్లాల నుంచీ జనం తరలివచ్చి పాదయాత్రకు నీరాజనాలు పలకడం రైతులు ఊహించని ఘట్టం! పులివెందుల నియోజకవర్గం వేంపల్లెకు చెందిన రైతులు ఉద్యమకారుల వెంట నడిచారు. సంతవెల్లూరుకు చెందిన దివ్యాంగుడు బత్తయ్య... కష్టమైనా ఇష్టంగా నడవడం ఉద్యమానికి ఉత్సాహాన్నిచ్చింది. నంద్యాలకు చెందిన ముస్లింలు యాత్ర దిగ్విజయం కావాలని.. వెంకటేశ్వరస్వామి రథం ముందు నమాజ్ చేసి సర్వమత సమ్మేళనాన్ని చాటారు. మీవెంటే మేమంటూ రైతులకు మనోస్థైర్యాన్ని ఇచ్చారు. కొందరు పసుపు నీళ్లతో..... రైతుల కాళ్లుకడిగితే, మరికొందరు పాలతో అభిషేకం చేసి నెత్తిన చల్లుకున్నారు. డేగపూడి గ్రామం వద్ద ఎప్పుడూ గడపదాటని ముస్లిం మహిళలు చంటిబిడ్డలను ఎత్తుకుని అమరావతి రైతుల కోసం వేచిచూసిమరీ సంఘీభావం తెలిపారు.