మూడు రాజధానుల చట్టంపై (Three Capitals Repeal Bill) ఇవాళ చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై రాజధాని రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెుదట రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవటాన్ని స్వాగతించిన రైతులు.. ఆ తరువాత మళ్లీ సమగ్రంగా వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకువస్తామని సీఎం జగన్ ప్రకటించటంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవగాహన లోపం, మెుండి వైఖరితో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రాజధానులంటూ ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో ప్రభుత్వంలోని ఏ ఒక్కరికీ సరైన స్పష్టత లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లోనూ.. తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో అన్నదాతలు మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చినప్పటి మాటకు కట్టుబడి ఉండాలని.. లేకుంటే ప్రజలు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలివేస్తారని ధ్వజమెత్తారు.
అమరావతి రైతుల మహా పాదయాత్ర (Amaravathi farmers Padayatra) 22వ రోజున నెల్లూరు జిల్లా కావలి నుంచి ప్రారంభమైంది. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పోరుబాట పట్టిన అన్నదాతలకు..గౌడ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. అడుగుడుగునా పాదయాత్రకు స్థానికులు పూలవర్షంతో మద్దతు తెలిపారు. కావలిలో పోలీసులు పదే పదే నిబంధనల పేరిట ఆంక్షలు విధించారు. పెద్దఎత్తున యాత్ర చేస్తున్నారంటూ డీఎస్పీ అభ్యంతరం వ్యక్తం చేయటంతో.. ఐకాస నేతలు కాళ్లు పట్టుకుని యాత్రను అడ్డుకోవద్దంటూ వేడుకున్నారు.