MAHA PADAYATRA : రాజధాని రైతుల పాదయాత్ర 21వ రోజు ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల నుంచి మొదలై.. తూర్పుగోదావరి జిల్లా దూబచర్ల వరకూ సాగింది. యాత్ర ప్రారంభానికి ముందు గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాత్ముడి చిత్రపటానికి ఐకాస నాయకులు నివాళులర్పించారు. అనంతరం ముందుకు కదిలిన రైతులను ద్వారకాతిరుమల గ్రామంలోకి అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఉగాది మండపం వద్ద పోలీసులు, ఐకాస నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగినా.. రైతులు వెరవలేదు. భయపడేది లేదంటూ ముందుకెళ్లారు. దారిపొడవునా రైతులకు అపూర్వ స్వాగతం లభించింది.
నల్లజర్ల మండలం అయ్యవరంలోకి ప్రవేశించిన రైతుల పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. గ్రామానికి వచ్చిన అమరావతి రైతులపై అయ్యవరం అన్నదాతలు పూలు చల్లి ఆహ్వానించారు. స్వామి రథం, రైతులకు బిందెలతో నీరుపోసి హారతులతో స్వాగతం పలికారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని స్థానిక ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు డిమాండ్ చేశారు.