ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మొక్కవోని దీక్షతో ముందుకెళ్తున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర

మొక్కవోని దీక్షతో రాజధాని రైతుల మహా పాదయాత్ర(amaravati farmers mahapadahyatra moving successfully) కొనసాగుతోంది. రెండోరోజు గుంటూరులో పాదయాత్ర చేసిన రైతులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, కులసంఘాలు మద్ధతు ప్రకటించాయి. రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నాయి. స్థానిక ప్రజలు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించి తమ మద్దతు తెలిపారు.

amaravati farmers mahapadahyatra
amaravati farmers mahapadahyatra

By

Published : Nov 3, 2021, 3:22 AM IST

మొక్కవోని దీక్షతో ముందుకెళ్తున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర

అమరావతి పరిరక్షణే లక్ష్యంగా రాజధాని రైతులు, మహిళలు రెండో రోజూ కదం తొక్కారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జై అమరావతి నినాదాలతో ముందుకు సాగారు. తిరుమలకు చేపట్టిన మహాపాదయాత్రలో భాగంగా రెండోరోజు..స్థానిక ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ప్రభుత్వానికి భూములిచ్చి మోసపోయామని..తమ బిడ్డల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందంటూ దారి పొడవునా ప్రజలకు ఆవేదనను వివరించే ప్రయత్నం చేశారు. తాడికొండలో పలుచోట్ల రైతులకు స్థానికులు స్వాగతం పలికారు. అడ్డరోడ్డు వద్ద ప్రైవేటు పాఠశాల విద్యార్థులు తమ సంఘీభావాన్ని తెలిపారు. నిడుముక్కల, పొన్నెకల్లు, రావెల, ముక్కామల, మోతడక, గుడిపూడి గ్రామాల నుంచి రైతులు, మహిళలు తరలివచ్చి మద్దతు ప్రకటించారు. రైతుల మహా పాదయాత్రలో తెలుగుదేశం, భాజపా, జనసేన, వామపక్ష నేతలతో పాటు..ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

గుంటూరులోని గోరంట్లకు పాదయాత్ర చేరుకోగా స్థానికులు రైతులపై పూలవాన కురిపించారు. అమరావతి పరిరక్షణ కోసం సాగుతున్న యాత్రకు మద్దతు తెలిపేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. నెల్లూరు నుంచి వచ్చిన ధన్వంతరి సంఘం సభ్యులు మహాపాదయాత్రలో పాల్గొన్నారు. నాయీ బ్రాహ్మణ సంఘం సైతం రైతులకు మద్దతు తెలిపింది. ఇది కేవలం రాజధాని ప్రాంత రైతుల సమస్య కాదని.. రాష్ట్ర భవిష్యత్తు అంశమని అన్నారు. ప్రజలంతా చేతులు కలపాల్సిన సమయమంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేడు గుంటూరు నుంచి వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వరకు 12 కిలోమీటర్ల మేర మూడోరోజు పాదయాత్ర సాగనుంది.

ABOUT THE AUTHOR

...view details