Amaravati Padayatra: రాష్ట్రం కోసం భూముల్ని త్యాగం చేసి, అమరావతి అభివృద్ధి కోసం మరోమారు రోడ్డెక్కిన రాజధాని రైతుల మహాపాదయాత్ర... నాలుగోరోజు బాపట్ల జిల్లాలోకి ప్రవేశించింది. రాష్ట్రానికి ఒకే రాజధాని, అది అమరావతేనంటూ స్థానిక ప్రజలు అన్నదాతలకు బ్రహ్మరథం పట్టారు. పరిసర ప్రాంత వాసులే కాకుండా పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం యాత్ర చేస్తున్న కర్షకులపై బంతిపూల వర్షంలా కురిపించారు. పెదరావూరులో ప్రారంభమైన యాత్ర... జంపని నుంచి వేమూరు వరకూ జనప్రవాహంలా సాగింది. బూతుమల్లి, యలమర్రు, వరాహపురం తదితర గ్రామ వాసులు బైకులు, ట్రాక్టర్లలో తరలివచ్చారు. తమ ఉద్యమానికి ప్రజా మద్దతు ఉందని, అంతిమ విజయం అమరావతిదేనని రైతులు స్పష్టం చేశారు.
వేమూరు శివార్లలో మధ్యాహ్నం భోజనం కోసం విరామం తీసుకున్న రైతులు...ఆ తరువాత యాత్ర కొనసాగించారు. ఆకుపచ్చ జెండాలు, టోపీలు, కండువాలు ధరించిన రైతులతో పాదయాత్ర మార్గం ఆకుపచ్చని సంద్రాన్ని తలపించింది. ఉద్యమ గీతాలు, డప్పు మోతల మధ్య కదం తొక్కిన అన్నదాతలు... అసెంబ్లీలో సీఎం ప్రసంగాన్ని ముక్తకంఠంతో ఖండించారు. ఒక్క రాజధాని నిర్మించలేని జగన్... మూడు రాజధానులు ఎలా కడతారని నిలదీశారు.