Amaravati Farmers Padayatra: వారి అడుగులు అమరావతి కలల రాజధానికి ప్రతీకలు. వారంతా... ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతినిధులు.! అమరావతీ నగర నిర్మాణంకోసం ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులు.! ఇందులో ఏనాడూ గడపదాటని మహిళలున్నారు. బీపీ, షుగర్లతో బాధపడే.. వృద్ధులున్నారు. భవిష్యత్‌ను కాంక్షించే యువకులున్నారు. ఉపాధిని వెతుక్కునే... కూలీలూన్నారు. ఇంతమంది కలిసి అడుగేస్తోంది ఒకే దిక్కు.! వీరందరిదీ ఒకటే మొక్కు...! న్యాయం చెప్పే న్యాయస్థానం నుంచి.. ధర్మాన్ని కాపాడే తిరుమల వెంకన్న సన్నిధికి పాదయాత్ర ప్రారంభించారు. ఒకే రాష్ట్రం-ఒకటే రాజధాని అంటూ.. నవంబర్ 1న కదం కదిపారు.
Amaravathi Farmers Protest: అమరావతి అంటే 29 గ్రామాల ప్రజలది మాత్రమేననే.. దుష్ప్రచారం రైతుల్లో పౌరుషం రగిల్చింది. రెండేళ్లుగా శిబిరాల్లో నినదించిన ….సేవ్ అమరావతి ఉద్యమాన్ని పొలిమేరలు..దాటించింది. అవమానాలు, అవహేళనలకు విసిగిపోయి తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యమంలోకి.. ఇంటికొకరు అన్నట్లు కదంతొక్కారు. తుళ్లూరులో సర్వమత ప్రార్థనలు చేసి సమరశంఖం పూరించారు. అక్కడ నుంచి ప్రతీ అడుగులో నిబద్ధత, నిజాయతీ, న్యాయం కావాలనే నినాదమే...! ఆరంభమే అదిరింది. ఉద్యమాన్ని మొదట్నుంచీ... హేళన చేస్తున్న హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నియోజకవర్గాల్లోనూ అడుగడుగనా అఖండ స్వాగతం లభించింది. కాడెడ్లతో రైతుల స్వాగతాలు, ఇంజినీరింగ్ పట్టభద్రులు,.. విద్యార్థుల సంఘీభావం, ఇలా జననీరాజనం. రాజధాని గ్రామాలు దాటి గుంటూరునగరంలో అడుగుపెట్టాక రైతులపై పూలజల్లు కురిసింది. జై అమరావతి నినాదాలతో...నగరం మార్మోగింది.
Nyayasthanam To Devasthanam: పాదయాత్ర స్పందన గుంటూరు జిల్లాలో ఒకలెక్క.. మిగతా జిల్లాల్లో మరో లెక్క. రాజధానేతర జిల్లాల్లో అంత స్పందన ఉండదేమో అనుకుంటే.... అనూహ్య మద్దతు వెల్లువెత్తింది. గుంటూరు కంటే ప్రకాశం.. ప్రకాశాన్నిమించి నెల్లూరు, నెల్లూరు కన్నా చిత్తూరు ఇలా..జిల్లా జిల్లాకూ.. రెట్టింపు ఆదరణ లభించింది. అడ్డంకులు ఎదురవుతాయనుకున్నచోట ఎదురేగి.. ఆహ్వానాలు అందాయి. పొలిమేరల్లోనే... స్వాగత అక్షర తోరణాలు ఆహ్వానం పలికాయి.ఒక జిల్లా నుంచి మరో జిల్లాలోకి యాత్రా ప్రవేశం.... జాతరను తలపిచింది. భాజాభజంత్రీలు, పూల వర్షం ఇలా ఒకటేంటి మహిళల్ని..... ఇంటి ఆడపడుచుల్లా స్థానికులు..ఆహ్వానించారు. పుట్టింటికి వచ్చిన తోబుట్టువుల్లా పసుపుకుంకుమపెట్టారు . హారతులుపట్టారు. అమరావతి రైతుల్ని.. ఒక్కో గ్రామం ఒక్కోలా ఆహ్వానించింది.