అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు 326వ రోజూ ఆందోళన తెలిపారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, దొండపాడు, నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. శిబిరాల వద్ద మహిళలు, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
వెంకటపాలెంలో మహిళలు వినూత్న నిరసన తెలియజేశారు. ధర్నాలు ప్రారంభమైనప్పటి నుంచి ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రధాని, రాష్ట్రపతికి రాసిన లేఖలను న్యాయదేవత ముందు ఉంచి.... తమకు న్యాయం చేయాలంటూ కొంగు చాపి అర్ధించారు. రాజధాని గ్రామాల్లో శిబిరాల వద్ద మహిళలు, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.