AMARAVATI FARMERS COMPLETED LORD BALAJI DARSHAN: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని అమరావతి రైతులు దర్శించుకుని.. మెుక్కులు చెల్లించుకున్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలని సంకల్పంతో.. ''న్యాయస్థానం నుంచి దేవస్థానం'' వరకు సాగిన యాత్ర శ్రీవారి దర్శనంతో పరిసమాప్తమైంది. 44 రోజులుగా అలుపెరగకుండా 450 కిలోమీటర్లు పాదయాత్రగా తిరుమలకు చేరుకున్న రైతులకు నేడు స్వామివారి దర్శన భాగ్యం కలిగింది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి స్లాట్ల వారీగా 850 మందికి తితిదే దర్శన అవకాశం కల్పించింది. ఐకాస నాయకులు పాదయాత్రగా వెళ్లిన రైతులను సమన్వయపరుస్తూ.. రూ. 300 టిక్కెట్లను అందించి దర్శనం చేయించారు. సాయంత్రం ఆరు గంటలకు సుపథం నుంచి ఆలయానికి చేరుకున్న ఐకాస నాయకులు రైతులతో కలిసి తిరుమలేశుని దర్శించుకున్నారు. వెంకన్న దర్శనానికి వెళ్లే సమయంలోనే తిరుపతిలో సభ నిర్వహణకు కోర్టు అనుమతివ్వడంతో అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేశారు.