అమరావతి రైతుల ఆందోళనలు 357వ రోజుకు చేరుకున్నాయి. ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ సంకల్పం చేస్తూ.. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఈరోజు చండీయాగం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ.. పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తాము చేస్తున్న పోరాటానికి ఎలాంటి అవరోధాలు లేకుండా.. ఉద్యమం బలోపేతం కావాలని అమ్మవారికి మొక్కుకున్నారు. రైతులకు అండగా నిలవాలని అమ్మవారిని ప్రార్థించారు.
అమరావతి నుంచి రాజధానిని తరలించాలనే ప్రభుత్వ ఆలోచన మారేందుకు ఈ యాగం నిర్వహించినట్లు రాజధాని రైతులు తెలిపారు. చండీ హోమంలో జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. రాజధాని రైతులపై జరిగిన దాడిని ఖండించారు. తమ పార్టీ తరపున అమరావతి రైతులకు పూర్తి అండగా ఉంటామన్నారు.