ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆస్తి పన్ను అభ్యంతరాలపై గోప్యతేలా? - ఆంధ్రప్రదేశ్​

ఆస్తి పన్ను కొత్త విధానంపై చాలా మందిని నుంచి ఫిర్యాదులు వస్తుందన్నందున వాటిపై అధికారులు గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త విధానంపై ప్రజలు, ప్రజాసంఘాలు తెలియజేసిన.. రాజకీయ పార్టీలు ఇచ్చిన అభ్యంతరాలు పట్టించుకోరా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

tax
ఆస్తి పన్ను

By

Published : Jul 9, 2021, 9:40 AM IST

ఆస్తి పన్ను కొత్త విధానంపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటివరకు వచ్చినవి ఎన్ని? వాటిపై తీసుకున్న చర్యలేమిటి? వంటి ప్రాథమిక సమాచారం బయటపెట్టడం లేదు. దీంతో కొత్త విధానంపై ప్రజలు, ప్రజాసంఘాలు తెలియజేసిన.. రాజకీయ పార్టీలు ఇచ్చిన అభ్యంతరాలు బుట్టదాఖలేనా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.

వార్షిక అద్దె విలువ (ఏఆర్‌వీ)పై ఇప్పటివరకు విధిస్తున్న పన్ను స్థానంలో ఆస్తి మూలధన విలువపై పన్ను వేసే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. దీన్ని అమలుచేసే క్రమంలో అత్యధిక పుర, నగరపాలక సంస్థల్లో ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్‌పై ప్రజలనుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రజలపై భారీగా భారం పడే కొత్త విధానాన్ని వెనక్కి తీసుకొని పాత విధానాన్నే అమలు చేయాలని ప్రజాసంఘాలు, పలు రాజకీయ పార్టీలు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాన్ని పుర కమిషనర్లకు తెలిపాయి.

ప్రజలనుంచి అభ్యంతరాలు స్వీకరించే ప్రక్రియ కొన్ని పుర, నగరపాలక సంస్థల్లో గత నెలాఖరుతో, ఇంకొన్ని చోట్ల ఈ నెల ఐదుతో ముగిసింది. అభ్యంతరాలను పలువురు పుర, నగరపాలక సంస్థల మెయిల్‌కు పంపారు. ఇంకొందరు లిఖితపూర్వకంగా పుర కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన బాక్సుల్లో వేశారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, అనంతపురం, కాకినాడ, కర్నూలు, కడప వంటి ప్రధాన నగరాలతోపాటు పెద్ద పురపాలక సంఘాల్లో మూలధన విలువపై పన్ను వేయడాన్ని ప్రజలు అభ్యంతరం తెలిపారని సమాచారం. దీంతో క్షేత్రస్థాయిలో పుర కమిషనర్ల నుంచి రాష్ట్ర పురపాలకశాఖ అధికారుల వరకు అభ్యంతరాలపై గోప్యత ప్రదర్శిస్తున్నారు.

ప్రత్యేక సమావేశంలో పెట్టి కొత్త విధానాన్ని ఆమోదింపజేసే యత్నం

ప్రజల అభ్యంతరాలను పుర, నగరపాలక పాలకవర్గ ప్రత్యేక సమావేశంలో పెట్టి ఆస్తి పన్ను కొత్త విధానాన్ని ఆమోదింపజేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం 2రోజుల కిందట పురపాలకశాఖ కమిషనర్‌, ఇతర అధికారులు రాష్ట్రంలోని పుర కమిషనర్లు, ఇతర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న వార్షిక అద్దె విలువ (ఏఆర్‌వీ) విధానంకంటే మూలధన విలువ ఆధారంగా విధించే పన్ను పద్ధతే మేలన్న అభిప్రాయాన్ని పాలకవర్గ సభ్యుల్లో కల్పించాలని కమిషనర్లకు అధికారులు సూచించారు. తిరుపతి, తణుకులో ప్రయోగాత్మకంగా కొన్ని అసెస్‌మెంట్లపై ఏఆర్‌వీ విధానంలో తాజాగా పన్నులు విధిస్తే మూలధన విలువపై వేసే పన్నుకంటే ఎక్కువ వచ్చిందన్న విషయాన్ని మేయర్‌, పుర ఛైర్మన్‌, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు వివరించాలన్నారు. ప్రత్యేక సమావేశానికి ముందే మేయర్లు, ఛైర్మన్లతో సమావేశమై ప్రజల అభ్యంతరాలపై చర్చించి ప్రత్యేక సమావేశంలో కొత్త విధానాన్ని ఆమోదించేలా మాట్లాడాలని కమిషనర్లకు అధికారులు వీడియో సమావేశంలో సూచించారు. అత్యధిక చోట్ల అధికార పార్టీ మేయర్లు, ఛైర్మన్లు ఉన్నారని గుర్తు చేస్తూ.. కమిషనర్ల కార్యదక్షతపై కొత్త విధానాన్ని ఆమోదింపజేసే అంశం ఆధారపడి ఉంటుందని కూడా అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే తుది నోటిఫికేషన్‌ ఇచ్చి కొత్త పన్నులు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

పేరుకే అభ్యంతరాల స్వీకరణా?

కొత్త విధానాన్ని పాలకవర్గం ఆమోదించాక ప్రజల అభ్యంతరాలు చెల్లుబాటు కావట్లేనని అధికారులు చెబుతున్నారు. అభ్యంతరాలను పాలకవర్గం కూడా పరిశీలనకు తీసుకొని చర్చించి కొత్త విధానానికి వ్యతిరేకంగా తీర్మానిస్తే.. అప్పుడు ఆలోచించాలని, ఆస్తి మూలధన విలువపై పన్ను విధించేందుకు పాలకవర్గం సమ్మతిస్తే ప్రజలనుంచి వచ్చే అభ్యంతరాలు ప్రాధాన్యం కోల్పోయినట్లేనని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే పాలకవర్గాలను ఒప్పించి ప్రత్యేక సమావేశంలో కొత్త విధానానికి అనుకూలంగా తీర్మానం చేయించే బాధ్యతను పుర కమిషనర్లకు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:దేశంలో భారీగా పెరిగిన విద్యుత్తు డిమాండ్‌

ABOUT THE AUTHOR

...view details