రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటం ది హేగ్‌లోని అంతర్జాతీయ కోర్టు దృష్టికి వెళ్లింది. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయుడు, న్యాయవాది కావేటి శ్రీనివాసరావు అంతర్జాతీయ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. రాజధాని అమరావతి నిర్మాణంలో రైతుల్ని భాగస్వాముల్ని చేస్తూ వారితో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, అక్కడ మానవహక్కులకూ విఘాతం కలుగుతోందని శ్రీనివాసరావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన రాసిన లేఖ/పత్రం తమకు అందినట్టుగా అంతర్జాతీయ కోర్టు ప్రాసిక్యూటర్ కార్యాలయంలోని సమాచార, సాక్ష్యాల విభాగం అధిపతి మార్క్ పి.డిలాన్ సోమవారం ధ్రువీకరణ పత్రం జారీచేశారు. ‘మీరు పంపిన సమాచారాన్ని మా కార్యాలయం కమ్యూనికేషన్ రిజిస్టర్‌లో నమోదు చేశాం. అంతర్జాతీయ కోర్టు నిబంధనల ప్రకారం... మీ పిటిషన్‌ను పరిశీలించి, దానిపై మా నిర్ణయాన్ని మీకు తగిన సమయంలో తెలియజేస్తాం. ఈ ధ్రువీకరణ పత్రం జారీ చేసినంత మాత్రాన... మీ పిటిషన్‌పై మేం దర్యాప్తు ప్రారంభించినట్టుగా గానీ, ప్రారంభిస్తామని గానీ హామీ ఇచ్చినట్టు భావించరాదు. మీ పిటిషన్‌పై మేం ఒక నిర్ణయం తీసుకున్నాక... అదేంటో, ఆ నిర్ణయానికి రావడానికి కారణాలేంటో లిఖితపూర్వకంగా తెలియజేస్తాం’ అని పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగానికి కూడా శ్రీనివాసరావు త్వరలో ఫిర్యాదు చేయనున్నట్టు అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు తెలిపారు.
అంతర్జాతీయ కోర్టులో అమరావతి కేసు! - రాజధాని రైతుల ఆందోళన
అమరావతి కోసం రాజధాని రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు ఓ ప్రవాస భారతీయుడు. అమరావతి నిర్మాణంలో రైతుల్ని భాగస్వాముల్ని చేస్తూ వారితో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, అక్కడ మానవహక్కులకూ విఘాతం కలుగుతోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
amaravati