రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని ఎక్కడనే విషయంపై చర్చ జరిగిన వేళ... అన్ని పార్టీలు అమరావతిని అంగీకరించాయి. భౌగోళికంగా.. రవాణాపరంగా..ఇతర సానుకూతల దృష్ట్యా అమరావతికే అందరూ జై కొట్టారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులను ఒప్పించి భూసేకరణ ద్వారా 33వేల ఎకరాలను సేకరించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఉద్దండరాయునిపాలెంలో పనులకు శంకుస్థాపన చేశారు. తక్షణావసరాల నిమిత్తం సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు నిర్మించారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలను ప్రతిపాదించారు. వేల కోట్ల రూపాయలతో రహదార్లు, భవంతులు నిర్మించారు. మరికొన్ని వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఈలోపు ప్రభుత్వం మారింది. అమరావతి నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. నిర్మాణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. 3 రాజధానుల ప్రతిపాదనతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందారు. ముందుగా సీఆర్డీఏతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాజధానిగా అమరావతిని కొనసాగించాలని... మూడు రాజధానుల ప్రతిపాదన వద్దంటూ రైతులు, మహిళలు ఉద్యమానికి దిగారు.
ప్రతి పల్లె ఉద్యమ క్షేత్రమే
శాసనసభలో 3 రాజధానుల ప్రకటన తర్వాత రాజధాని రైతులు, మహిళలు గతేడాది డిసెంబర్ 19న అమరావతి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, పెదపరిమి, తాడికొండ అడ్డురోడ్డు, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం నిరసనలు హోరెత్తాయి. కన్నతల్లి కంటే భూమిని ఎక్కువగా ప్రేమించే రైతులు... తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఆశపడ్డారు. మూడు రాజధానుల ప్రకటనతో రైతులు, మహిళల ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలనే చందంగా... రాజధాని ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
విపక్ష నేతలంతా రాజధాని రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు సీపీఐ, సీపీఎం, ప్రజా, రైతు, మహిళా సంఘాలు మద్దుతుగా నిలిచాయి. రోజుకో రూపంలో 96 రోజుల పాటు దీక్ష శిబిరాల వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అలా 200 రోజులుగా రాజధాని పల్లెలు అమరావతి నినాదాలతో మార్మోగుతున్నాయి. ఇప్పటికివరకు రాజధాని పోరులో 68 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. తాము ఏ ఒక్క పార్టీకో... నాయకుడికో భూములు ఇవ్వలేదని చెబుతున్న రైతులు... ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు.
మహిళల పోరాట స్ఫూర్తి
రాజధాని ఉద్యమాన్ని కొనసాగిస్తోంది రైతులైతే... ముందుండి నడిపిస్తుంది మహిళలే. ఉద్యమం ఇంత స్థిరంగా, బలంగా కొసాగుతుందంటే వారి పట్టుదలే కారణం. రాజధాని నిరసనలో భాగంగా జనవరి 10న దుర్గాదేవి దర్శనం కోసం మహిళలు పయనమవుతుంటే మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు అడ్డుగా వేసిన ఇనుపచువ్వలు దాటుకుని మరీ మహిళలు ముందుకుసాగారు. ఓవైపు గాయాలు బాధిస్తున్నా పోరాటపంథా వీడలేదు.
అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలోనూ మహిళలు దూసుకుపోయారు. రాళ్లు, రప్పలు దాటుకుంటూ... పోలీసులను తప్పించుకుంటూ అసెంబ్లీ గేటును తాకే ప్రయత్నం చేశారు. తుళ్లూరు నుంచి మందడం, తుళ్లూరు నుంచి అనంతవరం వెంకటేశ్వరస్వామి దర్శనానికి చేసిన పాదయాత్రలు.. రాజధాని మహిళల సంకల్పాన్ని ప్రపంచానికి చాటాయి. అరెస్టులు, నిర్బంధాలు చవిచూశారు. ఇంటి వద్ద పిల్లల్ని తలచుకుని జైలులో కన్నీరుపెట్టిన మహిళలెందరో. తమ పుట్టింటివారు ప్రేమతో కానుకగా ఇచ్చిన భూమి సైతం రాజధాని కోసం ఆనందంతో ఇచ్చిన మహిళలు ఇప్పుడు కన్నీరు పెడుతున్నారు. రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన తమ త్యాగాల్ని అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మనసు మారాలని వేడుకుంటున్నారు.
ఆందోళనకారులపై కేసులు