రాజధాని పోరుకు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. 'మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు' అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 68వ రోజుకు చేరాయి. వెలగపూడిలో శనివారం.. ఐదుగురు ఎస్సీ రైతులు 24 గంటల నిరాహార దీక్షకు కూర్చోగా.. ఇవాళ 151 మంది ఎస్సీ, ఎస్టీ రైతులు, రైతుకూలీలు... 24గంటల నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. ప్రభుత్వం తమ సమస్య పరిష్కారించాలంటూ 151 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల కోసం వీరు..దీక్ష చేయనున్నారు. డ్రోన్ ద్వారా మహిళలు స్నానం చేసే దృశ్యాలు చిత్రీకరిస్తున్నారంటూ పోలీసులు పైనా మహిళా రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము స్నానాలు చేసే ప్రదేశంలో డ్రోన్లు తిప్పుతూ మనోవేదనకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అమరావతి ప్రాంతంలో మహిళా ఐకాస నేతలు పర్యటించారు. మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కోసం భూములిస్తే.. వారి త్యాగాలను అవమానించడం తగదని మండిపడ్డారు. విశాఖలో భూదందా సాగించేందుకే సర్కారు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటోందని దుయ్యబట్టారు. ఈనెల 26న విజయవాడలో అమరావతి కోసం 24 గంటల నిరాహార దీక్ష చేపటనున్నట్లు మహిళా ఐకాస ప్రకటించింది.