కృష్ణాజిల్లా గుడివాడలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జీఎన్‌రావు, బోస్టన్ నివేదికలు దహనం చేయడానికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ గుడివాడ పర్యటన నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి నాయకులను అరెస్టు చేశారు. శాంతి యుతంగా చేస్తున్నామని నిరసన అడ్డుకోవడంపై ఐకాస నేతలు పోలీసులపై మండిపడ్డారు.
సంక్రాంతి సాక్షిగా అమరావతి ఆందోళనలు మిన్నంటాయి. ఆడుతూ పాడుతూ చేయాల్సిన భోగిమంటల కార్యక్రమాన్ని నిరసనలతో నిర్వహించాల్సి వచ్చింది. గుంటూరు నగరంలో అమరావతి రాజకీయ ఐకాస, యువజన విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో భోగమంటల ఆందోళనలు నిర్వహించారు. జీఎన్ రావు కమిటి, బోస్టన్ కమిటి నివేదికల్ని మంటల్లో వేసి నిరసన తెలిపారు. బోగస్ కమిటిలు వేసి... నివేదిక రాకముందే ముఖ్యమంత్రి తన మనసులోని మాట లీక్ చేయటం దారుణమన్నారు.
గుంటూరులోని ఎన్డీఆర్ స్టేడియంలో జిల్లాస్థాయి సంక్రాంతి సంబరాలు నిర్వహించగా... కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంబరాలు నిర్వహిస్తున్న సమయంలో అక్కడ ఉదయం నడక కోసం వచ్చిన వారు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. కలెక్టర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ వాకర్స్ అసోషియేషన్ ప్రతినిధులు నినదించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు భోగి మంటలు నిర్వహించారు. భోగి మంటల్లో జీఎన్ రావు, బీసీజీ కమిటీ ప్రతులు దహనం చేశారు. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు ఆందోళనలు విరమించబోమని స్పష్టం చేశారు.