పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 279వ రోజుకు చేరుకున్నాయి. అమరావతిపై కోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో 29 గ్రామాల్లో రైతులు పూజలు, హోమాలు చేస్తున్నారు. మంగళగిరి మండలం నీరుకొండలో న్యాయదేవత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
న్యాయస్థానాలలో అమరావతికి అనుకూలంగా తీర్పు రావాలని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ మందడంలో మహిళలు దీక్ష చేపట్టారు. మహాలక్ష్మి గణపతి, మృత్యుంజయ హోమం నిర్వహించారు. అమరావతిని రాజధానిగా కొనసాగాలని సంకల్పం తీసుకున్నామని మహిళలు చెప్పారు. ఐనవోలులో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం తమను అన్ని విధాలుగా మోసం చేసిందని వాపోయారు.