ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

amaravathi: 'అమరావతి గళం వినిపించండి' - అమరావతి రైతు పరిరక్షణ సమితి తాజా వార్తలు

అమరావతి గళం పార్లమెంట్​లో వినిపించాలని రాజధాని పరిరక్షణ సమితి నేతలు ఎంపీలను కోరారు. ఈ మేరకు మహారాష్ట్ర ఎంపీ ఎంపీ నవనీత్‌కౌర్​ను ‘ద అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ అమరావతి’ పుస్తకాన్ని అందజేశారు.

amaravathi leaders with mp navneet kour
amaravathi leaders with mp navneet kour

By

Published : Aug 6, 2021, 7:49 AM IST

రాజధాని అమరావతికి జరుగుతున్న అన్యాయంపై గళం విప్పాలని పార్లమెంటు సభ్యులకు అమరావతి రైతు పరిరక్షణ సమితి నాయకులు విజ్ఞప్తి చేశారు. అమరావతి చరిత్ర, జరుగుతున్న అన్యాయంపై అమరావతి రైతు పరిరక్షణ సమితి రూపొందించిన ‘ద అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ అమరావతి’ పుస్తకాన్ని నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా గురువారం దిల్లీలో ఆవిష్కరింపజేశారు. అనంతరం తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ నవనీత్‌కౌర్‌లకు వారు పుస్తకాన్ని అందజేశారు. పార్లమెంటులో అమరావతి రైతుల సమస్యలను లేవనెత్తాలని, అమరావతి రాజధానిగా కొనసాగేందుకు గళం విప్పాలని అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అమరావతికి మద్దతుగా నిలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సోదరుడు లలిత్‌షా, భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌, కేంద్ర కార్మిక బోర్డు ఛైర్మన్‌ వల్లూరి జయప్రకాష్‌ను కోరగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. భారతీయ మజ్దూర్‌సంఘ్‌ అఖిల భారత సంఘటన కార్యదర్శి బి.సురేంద్రను కలిసి అమరావతి రైతుల బాధలను వివరించగా ఆయన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళతానని హామీనిచ్చారని తెలిపారు. కార్యక్రమాల్లో సమితి నాయకులు ఎ.యుగంధర్‌, ఐ.ప్రసాద్‌, ఏ.శ్రీదేవి, సుజన, సూర్యనారాయణ, పరంధామయ్య, జి.జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పుస్తకంలో ప్రధానికి విన్నపాలు

‘ద అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ అమరావతి’ పేరుతో ప్రచురించిన 68 పేజీల పుస్తకంలో రాజధానికి శంకుస్థాపన చేసింది మొదలు, అమరావతి పరిరక్షణ ఉద్యమం, మహిళా రైతులపై పోలీసుల దాష్టీకం, దాడులవంటి పరిణామాలన్నిటినీ పొందుపరిచారు. పుస్తకాన్ని రాజధాని రైతు పరిరక్షణ సమితి, ఏపీ పరిరక్షణ సమితి ఛైర్మన్‌ బి.సూర్యనారాయణ ప్రచురించారు. రాజధాని రైతులు తమ గోడును ప్రధానికి విజ్ఞాపన రూపంలో పొందుపరిచారు. ‘మా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వెంటిలేటర్‌పై ఉంది. కేంద్రం నుంచి ఆక్సిజన్‌ కావాలి’ అని పేర్కొన్నారు. ‘అమరావతికి మీరు శంకుస్థాపన చేశారు. కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చింది. అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల పనులు జరిగాయి. కొన్ని మధ్యలో ఉన్నాయి. రాజధానికి 33 వేల ఎకరాలనిచ్చిన 29 వేల మంది రైతుల్ని, వారి భవిష్యత్తును ప్రస్తుత ప్రభుత్వం కృష్ణాలో ముంచేసింది. రైతులు చేస్తున్న ఉద్యమం 600 రోజుకు చేరుతోంది. మానసిక వేదనతో ఇప్పటివరకు 150 మంది రైతులు చనిపోయారు’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలనూ దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:YANAMALA: మంత్రివర్గం చేసిన తప్పిదాలకు ఉద్యోగులకు శిక్ష వేస్తారా..?

ABOUT THE AUTHOR

...view details