రాజధాని అమరావతిలో కేంద్రప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలకు 2016 నుంచి 2019 మధ్యలో సీఆర్‌డీఏ భూములు కేటాయించింది. 24 కేంద్రప్రభుత్వ సంస్థలకు 208 ఎకరాలు, 18 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 27 ఎకరాల్ని ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం రూ. 4 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొన్నింటికి ఉచితంగా మరికొన్నింటికి తక్కువ ధరకు గత ప్రభుత్వం భూములు కేటాయించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా... తుళ్లూరు-రాయపూడి మధ్య తమకు కేటాయించిన స్థలానికి ఇటీవల ప్రహరీ నిర్మించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కొంతమేర నిర్మాణాలు చేపట్టింది. మిగతా సంస్థలేవీ నిర్మాణాలు మొదలుపెట్టలేదు. ప్రధాని మోదీ స్వయంగా వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారాలన్నీ అమరావతి నుంచే సాగుతున్నాయి. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు చేపట్టకపోవటంపై విమర్శలు వస్తున్నాయి.
ఇప్పుడైనా కేంద్రం స్పందించాలి...
2018లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సెక్రటేరియేట్ విధానం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆయా రాష్ట్రాల రాజధానుల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని ఒకేచోట ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సీఆర్‌డీఏ ను స్థలం కోరగా... 22.5 ఎకరాలు కేటాయించారు. కానీ ఇప్పటి వరకూ పనులు మొదలుపెట్టలేదు. 2022-23 బడ్జెట్‌లో అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియేట్‌కి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ రూ.లక్ష మాత్రమే కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించినా హైకోర్టు తీర్పుతో అమరావతి రాజధాని అనే విషయం స్పష్టత వచ్చింది. ఇప్పుడైనా కేంద్రం ఈ విషయంలో స్పందించాలని విపక్షాలు, ఐకాస నేతలు కోరుతున్నారు.