అమరావతి పోరాటంలో అసువులు బాసిన వారికి జనభేరి సభలో ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించిన జేఏసీ నాయకులు.. ముందుగా అమరావతి వీరులకు నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అమరావతి కోసం వారు చేసిన త్యాగాలు గుర్తు చేసుకున్నారు. రైతులు, రైతు కూలీల త్యాగాలు వృథా పోవని, అమరావతి సాధించుకునే వరకూ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకూ 119 మంది అమరావతి ఉద్యమంలో మరణించారు. వారందరికీ ఐకాస నేతలు, రైతులు నివాళులు అర్పించారు.
ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాలు
జనభేరి సభలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. అమరావతి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు రమణ ఆధ్వర్యంలో ఉద్యమ గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. రైతుల పోరాటాన్ని, మహిళల ఉద్యమ స్ఫూర్తిని చాటి చెప్పేలా కళాకారులు గీతాలు ఆలపించారు. కళాకారులతో కలిసి సినినటి దివ్యవాణి నృత్యం చేశారు.