అమరావతి రాజధానిలో ఇళ్లు లేని వారికి నివాసాలు ఇస్తామంటే తాము అడ్డుకుంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని చేసిన ప్రకటనను అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఖండించింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని తాము నిర్విరామంగా ఆందోళనలు చేస్తున్న తరుణంలో.... రైతులు, మహిళలను రెచ్చగొట్టేలా మంత్రి వ్యాఖ్యలు చేస్తుండడం సరికాదని అభిప్రాయపడింది.
అమరావతిని మరో ధారవిగా మారుస్తారా?
రాజధాని అమరావతిపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై అమరావతి పరిరక్షణ సమితి ఐకాస మండిపడింది. రైతులు, మహిళలను రెచ్చగొట్టేలా మంత్రి వ్యాఖ్యలు చేయటం సరికాదంది.
విజయవాడలోని ఐకాస కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఐకాస కన్వీనరు మల్లిఖార్జునరావు, మహిళా ఐకాస నాయకురాలు డాక్టరు శైలజ, దళిత ఐకాస ప్రతినిధి చిలకా బసవయ్య తదితరులు మాట్లాడారు. రాజధాని రైతులకు ఇస్తానన్న ప్యాకేజి ఇచ్చి... సీఆర్డీఏ చట్టాన్ని గౌరవించాలని డిమాండ్ చేశారు. అమరావతిని ముంబాయిలోని ధారవి మాదిరిగా మరో మురికికూపం చేయబోతున్నారా అని ప్రశ్నించారు. అమరావతిలో 1,960 ఎకరాల స్ధలంలో రెండు లక్షలమంది ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. ఈ ప్రాంతం ఓ స్మశానం, ఎడారి అని చెప్పిన అధికార పార్టీ నేతలు అమరావతిలో పేదలకు ఎలా ఇళ్ల స్థలాలు కేటాయిస్తారని ప్రశ్నించారు. రాజధానిలో నిర్మించిన ఇళ్లను రాజధానిలో ఉంటున్న పేదలకు ఇవ్వకుండా బయటి వ్యక్తులకు ఇస్తామనడం సరైంది కాదన్నారు. కులాలు, సామాజికవర్గాల మధ్య రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం భావ్యంకాదని హితవు పలికారు.
ఇదీ చదవండి:నకిలీ గ్యాంగ్‌కు డబ్బిచ్చి...నిజమైన వారికి చిక్కారు