రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి తీరు అభ్యంతరకంగా ఉందని ఏపీ ఐకాస అమరావతి ప్రతినిధులు ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సచివాలయ సంఘం నాయకుడు తమకు సంబంధం లేని క్షేత్రస్థాయి ఉద్యోగుల తరఫున... ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య వివిధ శాఖపరమైన సంఘాల నాయకులను కించపరుస్తూ విమర్శలు చేశారని మండిపడ్డారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సందర్భంగా పరుష పదజాలంతో మీడియాలో స్పందించడంతో ఉద్యోగ సంఘాల పట్ల ప్రజల్లో చులకనభావం ఏర్పడిందని వారు తెలిపారు.
ప్రభుత్వం తక్షణం స్పందించి సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుని వ్యవహార శైలిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించింది. విజయవాడ రెవెన్యూ భవనంలో అమరావతి ఐకాస చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ డ్రైవర్లు, విద్యుత్తు, మున్సిపల్ మినిస్టీరియల్ ఉద్యోగులు, భాషా పండితులు, పోలీసు, అటవీ అధికారులు, ప్రభుత్వ విశ్రాంత ఉపాధ్యాయ, ఇతర అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏడు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు.