Amaravathi Jac Action Plan: మూడు రాజధానుల విషయంలో తమ వాదనకే కట్టుబడి ఉన్నామన్న సీఎం ప్రకటన అమరావతి రైతుల్లో మళ్లీ గుబులు రేపుతోంది. రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురిచేసి.. రాజకీయ లబ్ధి పొందేందుకే వైకాపా ప్రభుత్వం యత్నిస్తోందని... అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి విషయంలో దాఖలైన పిటిషన్లపై ఇటీవల హైకోర్టు 300 పేజీలకుపైగా స్పష్టమైన తీర్పునిచ్చింది. అందులో ఒకటి, రెండు అంశాలపైనే చర్చించటం ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి శాసనాధికారం లేదని కోర్టు చెప్పినట్లు వక్రీకరించటం సరికాదని ఐకాస నేతలు మండిపడ్డారు.
ప్రభుత్వ తీరుపై రాజధాని రైతుల ఆగ్రహం... భవిష్యత్ కార్యాచరణపై దృష్టి - AP News
Amaravathi Jac Action Plan: అమరావతి విషయంలో రైతుల ఆందోళనే నిజమైంది..! రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు విస్పష్టంగా తీర్పునిచ్చినా ప్రభుత్వ చెవికెక్కలేదు..! ఇక గురువారం రోజు అసెంబ్లీ వేదికగా సీఎం మళ్లీ మూడు రాజధానుల పాటే పాడారు..! రాజధాని రైతులు ఇక చేసేది లేక...భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు..! ప్రభుత్వం హైకోర్టు తీర్పు అమలు చేయకుంటే...మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నారు.
రైతులు ప్రస్తుతం సేవ్ అమరావతి నినాదాన్ని బిల్డ్ అమరావతిగా మార్చి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు వేలకోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు అమరావతికి కొంతైనా నిధులు కేటాయించాలి కదా అని నిలదీస్తున్నారు. హైకోర్టు ఆదేశాల్ని సీఆర్డీఏ అమలు చేయకపోతే ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తామని... రైతులు ప్రకటించారు. అన్ని రాజకీయ పక్షాలతోనూ భేటీ నిర్వహించి పోరాట ప్రణాళిక రూపొందిస్తామని అమరావతి పరిరక్షణ సమితి కో-కన్వీనర్ గద్దె తిరుపతిరావు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు... రెండ్రోజుల్లో ఐకాస నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. అమరావతి అవసరాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు మరోయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రాజధాని ఐకాస తరపున ఓ బృందం త్వరలో దిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలవనుంది.
ఇదీ చదవండి:Central on Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం మరో మెలిక..