అమరావతిలో నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలు పూర్తి చేయాలంటే రూ.2,154 కోట్లు అవసరమని.. ఇప్పటికే 70 శాతం నిర్మించినవాటి మీద రూ.300 కోట్లు ఖర్చు చేస్తే అవి పూర్తయిపోతాయని పురపాలక శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆధ్వర్యంలోని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో కూడిన 9 మంది కమిటీకి నివేదించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో కమిటీ తొలి భేటీలో ఈ అంశాన్ని వివరించారు. నిర్మాణంలో ఉన్న భవనాల్లో 70 శాతం కన్నా అధికంగా పని పూర్తయిన వాటిని తక్షణమే పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. మిగిలిన పనుల విషయంలో ఎలా ముందుకెళ్లాలో ఆయా కాంట్రాక్టర్లు, బ్యాంకర్లతో సమావేశమై మార్చి తొలి వారంలో జరిగే సమావేశం నాటికి వివరాలు సమర్పించాలని ఏఎంఆర్‌డీఏ అధికారులకు నిర్దేశించారు. అధికారులు కర్ణాటక, జమ్ము కశ్మీర్ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఎలాంటి వసతులు కల్పించారో అధ్యయనం చేసి రావాలని సూచించారు.
వసతులు.. పరిమితులపై చర్చ
మూడు రాజధానుల్లో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతి శాసన రాజధాని నిర్వహణకు కనీస వసతులు ఏమేం కావాలనేది చర్చించడమే ప్రధాన ఎజెండాగా కమిటీ సమావేశం జరిగింది. శాసన రాజధానికి ఏ మేరకు వసతులు కల్పించాలి, ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాలు, ఇతరత్రా అంశాల్లో ఎంత మేరకు పరిమితం కావాలనే అంశాలపై మార్చి రెండో వారానికల్లా నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్దేశించుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం మార్చి మొదటి వారంలోపు ఒకటి రెండుసార్లు సమావేశం కావాలని నిర్ణయానికి వచ్చారు. అమరావతి రైతులకు ఇబ్బంది కలగకుండా ఎలా ముందుకెళ్లాలి, న్యాయస్థానం ఉత్తర్వుల పరిధిలో ఏయే చర్యలు తీసుకోవాలనే అంశాలపైనా భేటీలో కొంత చర్చ జరిగినట్లు తెలిసింది.