అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ పెనుమాకలో రైతులు,రైతు కూలీలు నిరసన చేపట్టారు.రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఏకపక్ష నిర్ణయాలు వద్దు అమరావతే ముద్దు అంటూ నినదించారు.
27వ రోజు రాజధాని రైతుల పోరు - live page
12:10 January 13
పెనుమాకలోనూ రోడ్డెక్కిన రైతులు
10:18 January 13
గుంటూరు: కాకుమానులో రాజధాని కోసం వంటావార్పు
కాకుమానులో రాజధాని కోసం వంటావార్పు చేపట్టారు రైతులు. రహదారిపై రైతులు, తెదేపా నేతలు వంటావార్పును అడ్డుకున్నారు పోలీసులు. రాత్రి హోంమంత్రి సుచరిత ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. నిరసనగా వైకాపా నాయకులు చేస్తున్న ఆందోళనను అడ్డుకున్నారు పోలీసులు.
10:15 January 13
రహదారి పక్కన టెంట్‌లో దీక్ష కొనసాగిస్తున్న రైతులు
వెలగపూడిలో 27వ రోజు రైతు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. రహదారి పక్కన టెంట్‌లో దీక్ష కొనసాగిస్తున్నారు. రాజధాని గ్రామాల్లో ఆర్కే యాత్రకు ఎలా అనుమతించారని రైతులు ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఇవాళ ఆర్కే ర్యాలీ జరిగితే రేపు 29 గ్రామాల్లో రైతుల ర్యాలీలు జరుగుతాయని హెచ్చరించారు. తర్వాత జరిగే పరిణామాలకు డీజీపీ సమాధానం చెప్పాలని అన్నారు. రాజధాని రైతులు మంత్రి బొత్సను కలవడం అవాస్తవమని రైతులు తెలిపారు. భూములిచ్చిన రైతులను మంత్రులెవరూ సంప్రదించలేదన్నారు. రైతులు ఎవరూ మంత్రులను కలవలేదని స్పష్టం చేశారు.
09:30 January 13
మందడంలో ప్రైవేటు స్థలంలో ధర్నా చేస్తున్న రాజధాని రైతులు
మందడంలో ప్రైవేటు స్థలంలో రాజధాని రైతులు ధర్నా చేస్తున్నారు. నిన్న మహిళా కమిషన్ సభ్యుల సమయాన్ని అధికారులు ఉద్దేశపూర్వకంగా వృథా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులతో తక్కువ సమయం కమిషన్ సభ్యులు గడిపేలా కుట్ర పన్నారని అన్నారు. ఎమ్మెల్యే ఆర్కే పాదయాత్ర వారి కార్యకర్తల కోసమేనని తెలిపారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే దీక్ష చేస్తున్న రైతులను ఆర్కే కలవాలని రైతులు డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఏఒక్కరూ పండుగ చేసుకునే వాతావరణం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
07:58 January 13
27వ రోజు రాజధాని రైతుల పోరు
రాజధాని రైతుల పోరు 27వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు నిర్వహించనున్నారు రైతులు .వెలగపూడి, కృష్ణాయపాలెంలో 27వరోజు రైతు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఉద్ధండరాయినిపాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు నిరసన తెలుపుతున్నారు, మహిళల పూజలు చేస్తున్నారు. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం, ఇతర రాజధాని గ్రామాల్లో రైతు నిరసనలు కొనసాగనున్నాయి. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఆందోళనలు, ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ప్రైవేటు ప్రదేశాల్లో రైతులు నిరసనలు కొనసాగించనున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ప్రజాసంఘాలు, రాజకీయపక్షాల ఆందోళనలు తెలుపుతున్నారు.