ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Mahapadayathra: రెండోరోజు మహాపాదయాత్ర.. కదం కలిపి కదిలిన రైతులు..

Mahapadayatra
Mahapadayatra

By

Published : Nov 2, 2021, 9:18 AM IST

Updated : Nov 2, 2021, 7:06 PM IST

09:16 November 02

రాజధాని రైతులు, మహిళల మహాపాదయాత్ర

రెండోరోజు మహాపాదయాత్ర

రాజధాని అమరావతిని పరిరక్షించాలంటూ రైతులు చేపట్టిన 'న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహాపాదయాత్ర రెండోరోజు మరింత ఉత్సాహంగా సాగింది. తాడికొండలోని షిరిడి సాయి కళ్యాణ మండపం వద్ద నిన్న రాత్రి బస చేసిన రైతులు.. అక్కడి నుంచే రెండోరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర మెుదలైంది. రైతులు, రైతు కూలీలు, మహిళలు పాదయాత్రలో పాల్గొన్నారు. తాడికొండ గ్రామస్థులు రైతుల పాదయాత్రకు అడుగడుగునా స్వాగతం పలికారు. 'జై అమరావతి' అంటూ నినదించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

         మార్గ మధ్యలో పలు గ్రామాల ప్రజలు, పాఠశాల విద్యార్ధులు..రాజధాని రైతులు, మహిళలకు స్వాగతం పలికారు. నెల్లూరు నుంచి ధన్వంతరి సంఘం సభ్యులు రైతుల పాదయాత్రకు సంఘీభావంగా తరలివచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు రైతుల మహా పాదయాత్రలో పాల్గొన్నారు.  ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని కోసం భూములు ఇస్తే.. వైకాపా సర్కారు వచ్చిన తర్వాత రాజధాని మారుస్తారా అని రైతులు ప్రశ్నించారు. సీఆర్​డీఏ రద్దు బిల్లు చెల్లదని.. న్యాయస్థానంలో విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగాలంటూ మొక్కుకునేందుకే వెంకటేశ్వరస్వామి సన్నిధికి పాదయాత్ర చేస్తున్నట్లు వారు తెలిపారు. వర్షాన్నీ లెక్కచేయకుండా రాజధాని రైతులు పాదయాత్ర కొనసాగించారు. ప్లకార్డులు చేతబట్టి జై అమరావతి నినాదాలతో ముందుకు కదిలారు. రెండో రోజు పాదయాత్ర గోరంట్ల వద్ద ముగిసింది.

'న్యాయస్థానం నుంచి దేవస్థానం ’ పేరిట తుళ్లూరు నుంచి తిరుమల వరకూ చేపట్టిన మహా పాదయాత్ర.. సోమవారం ఉదయం తుళ్లూరులో ఉద్విగ్నభరిత వాతావరణంలో ప్రారంభమైంది. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం పరితపిస్తున్న ప్రజలు, భూములిచ్చిన రైతులు సాగిస్తున్న ఈ లాంగ్‌ మార్చ్‌కి దారి పొడవునా ప్రజలు నీరాజనాలు పట్టారు. తొలి రోజు 14.5 కిలోమీటర్ల మేర రైతులు పాదయాత్ర చేశారు.  పాదయాత్రకు  వైకాపా తప్ప అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. మూడు  రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా  పోరాటం రైతులు పోరాటం చేస్తున్నారు.  45 రోజుల పాటు మహాపాదయాత్ర కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 15న..  తిరుపతికి చెరేలా రూపొందించారు. డిసెంబర్​ 17న తిరుపతిలో జరిగే సభతో మహా పాదయాత్ర ముగియనుంది.

ఇదీ చదవండి: AMARAVATHI PADAYATHRA : ఉధృతంగా అమరావతి మహాపాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం

Last Updated : Nov 2, 2021, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details