అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు. 29 గ్రామాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన రైతులు తుళ్లూరు నుంచి మందడం వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి మీదుగా మందడం చేరుకోనున్నారు. రైతులు నిర్వహించిన ర్యాలీకి వామపక్షాలు, తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతు తెలిపి.. ర్యాలీలో పాల్గొన్నారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
అమరావతి ఉద్యమం 300 రోజులకు చేరుకుంటున్న సందర్భంగా విజయవాడలో రాజధాని రైతులు ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్టీఎస్ రోడ్డులోని శారదా కళాశాల నుండి 5 కిలోమీటర్లు ర్యాలీ చేపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెదేపా నేత గద్దె అనురాధ, సీపీఎం నేత బాబూరావు, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ, రాజధాని రైతులు పాల్గొన్నారు. 300 రోజులుగా అమరావతి రైతులు పలు రకాలుగా ఆందోళన చేస్తున్నా.. సీఎం జగన్‌లో కనీసం స్పందన లేకపోవడం దారుణమని రైతులు మండిపడ్డారు. రాజధానికి భూములిచ్చిన రైతులను నట్టేట ముంచారని మండిపడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉప సంహరించి కోవాలని డిమాండ్ చేసిన రైతులు.. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు ఆందోళన ఆపేది లేదని స్పష్టం చేశారు.
అమరావతి రైతులకు మద్దతుగా రాష్ట్రంలో పలుచోట్ల.. ప్రతిపక్ష నేతలు, రైతులు ర్యాలీలు నిర్వహించారు. తిరుపతిలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో తెలుగుదేశం నేతలు, రైతులు.. అంబేడ్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం అందించారు. భూములు ఇచ్చిన రైతుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు.