ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అమరావతిలోనే రాజధాని ఉంటుందనే వరకు పోరాటం ఆపేది లేదు'

By

Published : Jun 10, 2020, 12:07 PM IST

రాజధాని అమరావతి ఉద్యమం 175 రోజులైన సందర్భంగా గుంటూరులో రాజకీయ, రాజకీయేతర ఐకాస నేతలు నిరసన దీక్ష నిర్వహించారు. తెదేపా, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. వీరికి రాజధాని ప్రాంత రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిలో రాజధాని కొనసాగిస్తామనే ప్రకటన వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని ఐకాస నేతలు స్పష్టం చేశారు.

amaravathi farmers protesting for capital
అమరావతి కోసం ఐకాస నేతల దీక్షలు

అమరావతి నుంచి రాజధానిని మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న పోరాటం 175 రోజులకు చేరింది. ఈ తరుణంలో రైతుల ఉద్యమానికి మద్దతుగా... తామున్నామంటూ గుంటూరులో రాజకీయ, రాజకీయేతర ఐకాస నేతలు దీక్షలు చేపట్టారు. తెదేపా జిల్లా కార్యాలయంలో మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ రామకృష్ణ ఈ దీక్షలను ప్రారంభించారు. ప్రభుత్వ వైఖరిని, ముఖ్యమంత్రి తీరుని నేతలు తప్పుబట్టారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇన్ని రోజుల పాటు దీక్షలు జరగటం ప్రపంచంలోనే మొదటిసారని రాజకీయేతర ఐకాస కన్వీనర్ మల్లికార్జునరావు అన్నారు. అయినా ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోవటం సిగ్గుచేటని విమర్శించారు. రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారే తప్ప... వారికి ఎక్కువై ఇవ్వలేదని మహిళా ఐకాస కన్వీనర్​ శైలజ అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే డబ్బున్న వాళ్లకు అపాయింట్​మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి... రాజధాని రైతులను కలిసేందుకు మాత్రం సిద్ధంగా లేకపోవటం బాధాకరమని వ్యాఖ్యానించారు.


దళితుల సంక్షేమం కోసం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్... తమ వర్గానికి చేసిందేం లేదని అమరావతి దళిత ఐకాస నేతలు విమర్శించారు. ఎన్నికల ప్రణాళికలో రాజధాని దళిత రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రికి అమరావతి అని పలికేందుకు కూడా ఇష్టం లేకపోవటంపై మైనార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతిలోనే రాజధాని కొనసాగుతోందని ప్రభుత్వం ప్రకటించే వరకూ... తమ పోరాటం వివిధ రూపాల్లో సాగుతుందని ఐకాస నేతలు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details