వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో అందోళన చేస్తున్న రైతులకు అమరావతి అన్నదాతలు సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు మందడంలో రైతులు, మహిళలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ప్రధాని మోదీ అమరావతిని చంపేశారని... అలాగే దేశవ్యాప్తంగా రైతులకు నష్టం వాటిల్లే విధంగా నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని అన్నదాతలు విమర్శించారు.
వెంకటపాలెంలో మహిళలు, రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ కనీసం ఆకాశం నుంచైనా తమ ధర్నాను ప్రత్యక్షంగా తిలకించాలంటూ బయటకు వచ్చి నినాదాలు చేశారు. సీఎం వచ్చే సమయంలో పోలీసులు పరదాలు పట్టుకొని తమకు అడ్డంగా ఉంటున్నారని... అందుకే తమ నిరసనను ఇలా తెలియజేశామన్నారు. మిగిలిన గ్రామాల్లోనూ 348వ రోజు అమరావతికి మద్దతుగా నిరసన దీక్షలు కొనసాగించారు.