అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మందడంలో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఆందోళన 30 రోజులకు చేరిన సందర్భంగా పాలకులకు.. కనువిప్పు కలగాలంటూ ప్రదర్శన నిర్వహించారు. చేతిలో బైబిల్, భగవద్గీతను పట్టుకుని జై అమరావతి అంటూ నినదించారు.
తుళ్లూరు మండలంలో అమరావతి పరిరక్షణ ఉద్యమం ఉద్ధృతమైంది. కమిటీల పేరుతో.. అమరావతిపై విషప్రచారానికి దిగుతున్నారని పెదపరిమి రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిని తరలించబోమని ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని అమరావతి రాజధాని రైతుల ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ చెప్పారు.
రాజధానిని తరలిస్తారనే మనోవేదనతో చనిపోయిన రైతులకు అమరావతి పరిరక్షణ ఐకాస నేతలు నివాళులు అర్పించారు. గుంటూరు లాడ్జి కూడలి వద్ద మౌనదీక్ష చేపట్టి.... అంజలి ఘటించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో చేపట్టిన ర్యాలీలో తెదేపా మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు.
మూడు రాజధానులు వద్దు ఒక రాజధానే ముద్దు అంటూ ప్రకాశం జిల్లాలో ప్రదర్శనలు జరిగాయి. నాగులపాలెంలో రైతులు, మహిళలు ర్యాలీ చేశారు. గొనసపూడిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సేవ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ కంబాలదిన్నెలో రైతులు, తెదేపా నేతలు ట్రాక్టర్లు, బైకులతో ర్యాలీ చేశారు. సీఎం మనసు మారాలంటూ కొబ్బరికాయలు కొట్టారు. పర్చూరు, ఇంకొల్లులో... ఐకాస ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అనంతపురం జిల్లా గుంతకల్లులో అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ చేపట్టారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: ఇవాళ గవర్నర్తో అమరావతి పరిరక్షణ సమితి సమావేశం