అమరావతిని పరిపాలన రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాజధాని రైతులు, మహిళలు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు 238వ రోజుకు చేరాయి. నిరసన కార్యక్రమాలతోపాటు పర్వదినాల్లో నిర్వహించే వేడుకల ద్వారా తమ ఆవేదనను వెల్లడించే ప్రయత్నం చేశారు. రాజధాని ప్రాంత రైతులు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తుళ్లూరు ధర్నా శిబిరంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి పూలమాలలు వేసి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పాలకుల నుంచి అమరావతిని కాపాడాలంటూ శ్రీకృష్ణుడిని రైతులు, మహిళలు వేడుకున్నారు. దొండపాడులో పోలేరమ్మ తల్లికి రైతులు, మహిళలు పొంగళ్లు సమర్పించారు. రాజధాని అమరావతిని గ్రామ దేవత కాపాడాలంటూ వేడుకున్నారు.
వినూత్న నిరసన
తుళ్లూరులో ఉట్టి కొట్టే కార్యక్రమంలో బాలబాలికలు కృష్ణుడు, గోపికల వేషధారణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి పేరిట గోవులకు పసుపు రాసి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు రాజధాని అమరావతిని కాపాడాలని.. పాలకుల మనసు మార్చాలని రాజధాని రైతులు, మహిళలు వేడుకున్నారు. తుళ్లూరు శిబిరంలో ద్రౌపది వస్త్రాపహరణం నాటిక ద్వారా తమ నిరసనను ప్రభుత్వం కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ఆనాటి ద్రౌపది మాదిరిగానే ఈనాడు అమరావతి ఆత్మాభిమానాన్ని పాలకులు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారంటూ వస్త్రాపహరణం ఘట్టాన్ని ఆవిష్కరించారు. వస్త్రాపహరణం జరుగుతుంటే శ్రీకృష్ణుడి రూపంలో న్యాయదేవత చీర అందిస్తున్నట్లు నాటిక ఆవిష్కరించారు. చివరకు అమరావతి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయలేక విఫలమై ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే సందేశం ఇస్తూ లఘునాటిక ముగిసింది. ఇంత జరుగుతున్నా కేంద్రం ప్రేక్షకపాత్ర పోషించడాన్ని రైతులు, మహిళలు నిరసిస్తూ.... ధృతరాష్ట్రుడి పాత్రను కూడా పొందుపరిచారు. ఈ నాటిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడం, అమరావతిని కాపాడుకోవటం తమ లక్ష్యమని రాజధాని రైతులు, మహిళలు స్పష్టం చేశారు.