ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అలుపెరగని పోరు: 500వ రోజు అదే హోరు

By

Published : Apr 30, 2021, 10:33 PM IST

పరిస్థితులు క్లిష్టంగా మారినా పోరాటం ఆగలేదు. ప్రభుత్వం నుంచి స్పందన కరవైనా పంథా మారలేదు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. రైతుల అలుపెరుగని పోరు 500రోజులకు చేరింది. 'అమరావతి ఉద్యమ భేరి' పేరుతో వర్చువల్ విధానంలో నిర్వహించిన సమావేశంలో వేలాది మంది పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం స్పందించేంత వరకూ పోరు ఆగబోదని రైతులు స్పష్టం చేశారు.

amaravathi-farmers-protest-reached-five-hundred-days
500వ రోజు... అదే నిరసనల హోరు

ఒకటి కాదు... రెండు కాదు... 500రోజులుగా అమరావతి ఉద్యమ స్ఫూర్తి రగులుతూనే ఉంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న పోరును అణచివేసేందుకు ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఉద్యమం ఉద్ధృతమైందే తప్ప సంకల్పం సడల లేదు. కొవిడ్ విజృంభణ వేళ 500వ రోజూ 'అమరావతి ఉద్యమ భేరి' పేరుతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపూడి దీక్షా శిబిరంలో దళిత చైతన్య గీతిక సీడీని ఆవిష్కరించారు. అమరావతి ఐకాసతో పాటు దళిత ఐకాస నేతలు పాల్గొన్నారు. ఉద్ధండరాయినిపాలెంలో బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అమరావతిని కాపాడాలని, ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మహిళల పాత్ర అనిర్వచనీయం...

అమరావతి పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దీక్షా శిబిరాలను సందర్శించిన ఆయన రైతులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం విలువైన భూములిచ్చిన తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని మహిళా రైతులు ఆవేదన చెందారు. రాజధాని రైతులకు న్యాయం చేస్తామన్న ప్రభుత్వం మాటలకే పరిమితమైందని... కనీసం కౌలు కూడా సకాలంలో వేయలేదని ఆరోపించారు.

500వ రోజు... అదే నిరసనల హోరు

ఉద్యమంలో చనిపోయిన వారికి నివాళులు...

అమరావతి ఉద్యమంలో చనిపోయిన రైతులకు పరిరక్షణ సమితి నివాళులు అర్పించింది. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన రోజు నుంచి తమకు తిండి, నిద్ర కరవైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతి కోసం చేస్తున్న పోరాటాన్ని వివిధ రూపాల్లో కొనసాగించాలని రైతులు తీర్మానించారు. కొవిడ్ ఉద్ధృతి తగ్గిన తర్వాత ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తామన్నారు.

ఇవీచదవండి.

ప్రపంచ పురోగతికి, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి శ్రమ జీవుల పాత్ర ఎనలేనిది : పవన్

స్విమ్స్​లో బెడ్ల కొరత.. ఆరు బయటే రోగులకు ఊపిరులూదుతున్న వైద్యులు

ABOUT THE AUTHOR

...view details