రాజధానికి శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గుంటూరు నుంచి అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం వరకూ ‘మహా పాదయాత్ర’ నిర్వహించనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి, కో కన్వీనర్ తిరుపతిరావు, రాజధాని ఐకాస కన్వీనర్ సుధాకర్ తెలిపారు. అయితే ఈ ప్రదర్శనల్లో వంద మందికి మించకూడదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు.
మహాపాదయాత్ర వివరాలు
- గురువారం ఉదయం 7.30కు గుంటూరు మదర్ థెరిస్సా విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభం. లాం గ్రామం, తాడికొండ అడ్డరోడ్డు, తాడికొండ, పెదపరిమి, తుళ్లూరు మీదుగా ఉద్దండరాయునిపాలెం చేరుకుంటారు.
- ఉదయం 9గంటలకు మందడం, రాయపూడి నుంచి ఉద్దండరాయునిపాలెంలోని శంకుస్థాపన ప్రాంతం వరకూ ‘దగాపడ్డ అమరావతి దళిత బిడ్డ’ పేరుతో రైతుల పాదయాత్ర.
- 10.30 గంటలకు సర్వమత ప్రార్థనలు
- 11.12 నుంచి 12.15 గంటల వరకు ‘అమరావతి చూపు- మోదీ వైపు’ పేరుతో కేంద్రాన్ని అభ్యర్థిస్తూ ప్రదర్శన
- మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు ‘అమరావతి ఆవశ్యకత- రక్షణ’పై ప్రముఖుల సందేశాలు అమరావతి రక్షతి రక్షితః కార్యక్రమం
- సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు దీక్షా శిబిరాల ముందు కాగడాల ప్రదర్శన
వందమందికి మించితే నిలువరించండి
‘మేం ఉగ్రవాదులం కాదు.. దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతలం.. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వానికి సమస్యను తెలియజెప్పేందుకు చేస్తున్న శాంతియుత కార్యక్రమానికి అడ్డు తగులుతారేంటయ్యా’ అంటూ రాజధాని రైతులు పోలీసుల వద్ద వాపోయారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశం వద్ద రైతులు ఏర్పాట్లు చేస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేని కార్యక్రమానికి ఏర్పాట్లు ఎలా చేస్తారని ప్రశ్నించగా పోలీసులు, రైతుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. మూడు రాజధానులకు అనుకూలంగా దీక్ష చేసేందుకు ఎలా అనుమతించారని రైతులు పోలీసులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రదర్శనల్లో వందమంది మించకూడదని, ఇంతకంటే ఎక్కువ జనం ఎక్కడైనా ఉంటే వారిని నిలువరించాలని క్షేత్రస్థాయి పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీలు, ప్రదర్శనల్లో ఎక్కడా స్థానికేతరులను అనుమతించొద్దని, అలాంటివారు ఎవరైనా వస్తే గుర్తించాలని ఆదేశించారు.