రాజధానిగా అమరావతిని కొనసాగించటం కోసం 357 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు..ఇవాళ కూడా తమ పోరాటాన్ని కొనసాగించారు. రాజధాని పరిధిలోని పలు గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మందడం, వెలగపూడిలోని దీక్షా శిబిరాల్లో రైతులు, మహిళలు నిరసన తెలిపారు. తుళ్లూరులో వేదపండితులు శ్రీరామమూర్తి, ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా చండీయాగం నిర్వహించారు. యాగంలో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. రాజధానిని ఇక్కడే ఉంచాలని సంకల్పం చేశారు. తాము చేస్తున్న ఉద్యమంలో, న్యాయపోరాటంలో విజయం దక్కేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. మొండి ప్రభుత్వాన్ని మార్చాలంటే ఎంతో సహనం అవసరమని... ఆ దిశగా తమని నడిపించాలని ప్రార్థించినట్లు మహిళలు తెలిపారు.
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అమరావతికి మద్దతుగా చండీయాగం నిర్వహించాం. బావితరాల భవిష్యత్తు చక్కగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించాం. ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చి...అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నాం.
-మహిళా రైతు
మహిళా రైతులపై ఉద్ధండరాయిని పాలెంలో జరిగిన దాడిని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస యాదవ్ ఖండించారు. తుళ్లూరులోని దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన అమరావతి రైతులకు తమపార్టీ అండగా ఉంటుందన్నారు. పవన్ కల్యాణ్‌ను మరోసారి రాజధాని ప్రాంతానికి తీసుకురావాలని రైతులు కోరగా...తమ అధినేత దృష్టికి ఈ విషయం తీసుకెళ్తామని చెప్పారు. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం నడిపిస్తున్న ఉద్యమాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు. అక్కడ ఉద్యమించే వారిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులెవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.