అమరావతి పరిరక్షణ పోరాటం ఉద్ధృతంగా సాగుతోంది. 3 రాజధానులు వద్దు.... అమరావతే ముద్దు అంటూ దీక్షలు, ధర్నాలు కొనసాగిస్తున్న రైతులు.. భారీ ప్రదర్శనలతో తమ ఆకాంక్షను చాటుతున్నారు. పాదయాత్రగా వెళ్లి బెజవాడ దుర్గమ్మ, అనంతవరం వెంకన్నకు... మొక్కుకున్న 29 గ్రామాల ప్రజలు.. భారీ వాహన ర్యాలీ నిర్వహించారు. వందలాది ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు అందుబాటులో ఉన్న అన్ని వాహనాలతో ర్యాలీలో పాల్గొన్నారు.
తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి మొదలైన ర్యాలీ... రాయపూడి, వెలగపూడి, లింగాయపాలెం, మోదుగులలంకపాలెం, కృష్ణాయపాలెం.. ఐనవోలు, శాఖమూరు, పెదపరిమి, నెక్కల్లు, వడ్డమాను, హరిశ్చంద్రపురం, బోరుపాలెం, దొండపాడు మీదుగా.. తిరిగి తుళ్లూరు చేరుకుంది. రైతులు, రైతు కూలీలు జాతీయ పతాకాలు, ఐకాస జెండాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు.