రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరు మండలం పెదపరిమిలో మహిళలు ధర్నా చేశారు. మందడంలోనూ రైతుల పోరాటం కొనసాగింది. రాజధాని వ్యవహారంలో కమిటీల పేరుతో కాలయాపన చేసిన ప్రభుత్వం... ఇప్పుడు శాసనమండలిని రద్దు చేసి మొండిగా వ్యవహరిస్తోందని రైతులు ఆరోపించారు. తాడికొండ అడ్డరోడ్డులో రైతులకు మద్దతుగా ఐకాస ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. తెలుగుదేశం నేతలు వర్ల రామయ్య, తెనాలి శ్రవణ్‌కుమార్‌లు ధర్నాలో పాల్గొన్నారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇచ్చేంతవరకూ నిరసనలు కొనసాగుతాయని రైతులు, మహిళలు తేల్చి చెప్పారు.
అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో విజయవాడలోని వారధి నుంచి బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని తెలుగుదేశం నేత గద్దె అనురాధ అన్నారు. సీఎం మొండి వైఖరితో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ విమర్శించారు. అమరావతినే రాజధానిగా సాధించేంత వరకూ రైతుల ఉద్యమానికి మద్దతుగా ఉంటామని చెప్పారు.